యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పార్లమెంట్ స్థానాలకు జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఐదు వీవీప్యాట్లలోని స్లిప్‌లను లెక్కించనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు పై సహాయ రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్‌లు, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానం
రిటర్నింగ్ అధికారి మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ కెనడిలు హాజరైన ఈ సమావేశంలో దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను వెంటనే
ప్రారంభించాలని తెలిపారు. ఈ నెల 16వ తేదీన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం హైదరాబాద్ నగరానికి వస్తున్నారని
తెలిపారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది, అధికారులకు 16వ తేదీన హరిహర కళాభవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు, 22వ తేదీన కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్‌తో పాటు మరో
సారి శిక్షణ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా నియమ నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, కౌంటింగ్ సందర్భంగా ఏర్పడే సమస్యలను, పరిస్థితులను సంబంధిత
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులే పరిష్కరించేందుకు తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.