YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాతాళానికి గంగ

పాతాళానికి గంగ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అనంతపురం: జిల్లాలో భూ గర్భ జలాలు కానరావడం లేదు. అసలే కరవు జిల్లా ఆపై భూ గర్భ జలాలు అడుగంటిపోవడంతో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా భూగర్భజల శాఖ నివేదికల ప్రకారం ఈనెల మొదటి వారానికి భూగర్భ జల మట్టం పాతాళానికి చేరింది. గతేడాదితో పోలిస్తే 2.76 మీటర్ల లోతుకు దిగజారాయి. గత ఏడాది మే మొదటి వారంలో 20.54 మీటర్ల లోతులో ఉండగా.. ప్రస్తుతం 23.30 మీటర్ల లోతులో జలం లభిస్తోంది. తీవ్ర వర్షాభావం కారణంగా జిల్లాలో భూగర్భ జలాలు రోజు రోజుకు అథఃపాతాళానికి ఇంకుతున్నాయి. ఎంత వేగంగా అంటే నెలకు ఓ అడుగు చొప్పున పడిపోతున్నాయి. ఫలితంగా బోర్లు ఎండిపోయి.. ఇటు వ్యవసాయం, అటు తాగునీటిపై ప్రభావం చూపుతోంది.
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. దీనికి కారణం గత ఏడాది నైరుతి, ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడమే. గత జూన్‌ నుంచి ఇప్పటిదాకా 514.90 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 298.40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కన్నా 42 శాతం లోటు ఏర్పడింది. ఈలోటు భూగర్భ నీటి మట్టాలపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో 63మండలాలు ఉండగా.. నాలుగింటిలోనే నీటి మట్టం సాధారణ స్థాయిలో ఉంది. మిగతాచోట్ల క్లిష్ట, సంక్లిష్ట, ప్రమాద స్థాయిల్లో ఉన్నాయి. జిల్లాలో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడానికి వర్షాభావంతోపాటు ఓ మోస్తరుగా పడి.. భూమిలోకి ఇంకిన నీటిని ఇబ్బడిముబ్బడిగా బోర్ల ద్వారా తోడేయడం ప్రధాన కారణం. ప్రధానంగా వ్యవసాయం, గృహ వినియోగం, పరిశ్రమల అవసరాల కోసం భూగర్భ జలాలను గొట్టపు బావుల ద్వారా విపరీతంగా తోడేస్తున్నారు. ఇలా తోడుతూ పోతే భూమిలో నీటి చెమ్మ కరవై నేల ఎడారిగా మారుతుంది. వర్షం నీటిని నిల్వ చేయాలి, నిల్వ చేసిన నీటిని ఇంకింప చేయాలి. నీటి పొదుపు కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. దీనివల్ల ఫలితాలు వచ్చినా.. వినియోగం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నీటిని పొదుపుగా వాడుకునే పద్ధతులు ఉన్నా పాటించడం లేదు. విరివిగా నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌లు, వాటర్‌షెడ్‌లు నిర్మించి నీటిని ఇంకింపజేయాలి. వర్షాకాలానికి ముందు చెరువులు, వాగులు, వంకల్లో పూడికలు తొలగిస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.
నానాటికీ తగ్గుతున్న నీటి మట్టం వల్ల తాగునీటి పథకాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈసారి జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇప్పటికే 400కు పైగా రక్షిత మంచినీటి పథకాలు ఎండిపోయాయి. వేల సంఖ్యలో వ్యవసాయ బోర్లు ఇంకిపోయాయి. గత వేసవిలో 28 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరుకు 540 గ్రామాలను సమస్యాత్మకంగా గ్రానీస అధికారులు గుర్తించారు. ఈ గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

Related Posts