YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ మెజార్టీపైనే చర్చ...

మోడీ మెజార్టీపైనే చర్చ...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కాశీ… ద్వాదశ జ్యోతిర్లాంగాల్లో అత్యంత మహిమాన్వితమైంది. విశ్వనాధుడు స్వయంభువుగా వెలసిన ఈ నగరాన్ని కాశీ అని కొందరు, వారణాసి అని మరికొందరు, బెనారస్ అని ఇంకొందరు 
పిలుస్తుంటారు. ఈ నగరం పేరు తెలియని భారతీయులు ఎవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తరించాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. ఇంతటి ఆధ్యాత్మిక నగరంలో ఇప్పుడు ఎన్నికల హడావిడి నెలకొంది. ఏడోదశ, ఆఖరి దశలో భాగంగా ఈ నెల 19వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మామూలుగానే వారణాసి రాజకీయంగా కీలక నియోజకవర్గం. గతంలో మాజీ ప్రధాని చంద్రశేఖర్, బీజేపీ సీనయిర్ నేత మురళీ మనోహర్ జోషి వంటి ఉద్దండులు ఈ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014లో నాటి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ పోటీ చేయడంతో రాజకీయాల్లో వారణాసి ప్రాధాన్యం బాగా పెరిగిపోయింది. మోదీ తాను పోటీ చేసిన గుజరాత్ లోని వడోధర స్థానాన్ని వదులుకుని వారణాసినే కొనసాగించడం విశేషం. తాజాగా ఒక్క కాశీ నుంచే ఆయన పోటీ చేయడం చెప్పుకోదగ్గ అంశం. సహజంగా ప్రధాని నియోజకవర్గం కావడంతో అందరి చూపూ దానిపైనే ఉంటుంది.గంగానదీ తీరంలో విస్తరించిన ఈ మహానగరం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యేందుకు ప్రధాని మోదీతో పాటు పలువురు పోటీ పడుతున్నారు. బరిలో వందకు పైగా అభ్యర్థులు ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి మోదీ, ఎస్పీ ,బీఎస్పీ కూటమి అభ్యర్థిగా షాలినీ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్ బరిలో ఉన్నారు. మిగిలిన వారి ప్రాధాన్యం తక్కువే. గత ఎన్నికల్లో మోదీపై పోటీ చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దారుణంగా ఓడిపోయారు. నాటి ఎన్నికల్లో మోదీకి 5.81 లక్షల ఓట్లు రాగా, కేజ్రీవాల్ కు 2.09 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్75 వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. తాజా ఎన్నికలలో విజయంపై మోదీ ధీమాగా ఉన్నారు. మెజారిటీ ఎంతన్నదే సమస్య అని కమలం శ్రేణులు చెబుతున్నాయి.అయితే అది అంత తేలిక కాదని, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థులు స్పష‌్టం చేస్తున్నారు. ఈ లోక్ సభ స్థానం పరిధిలో వారణాసి (కంటోన్మెంట్), వారణాసి (దక్షిణ), వారణాసి (ఉత్తర), అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అజయ్ రాయ్ సీనియర్ నాయకుడు. బీజేపీలోనే ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. లోక్ సభకు పోటీ చేయడం ఇది రెండోసారి. బీజేపీ నుంచి సమాజ్ వాదీ పార్టీలో చేరిన అజయ్ రాయ్ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. బీజేపీ విద్యార్థి నేతగా రాజకీయాల్లో ప్రవేశించిన రాయ్ 1996లో తొలిసారిగా కొలాస స్థానం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. స్థానికంగా పట్టు ఉన్నప్పటికీ మోదీని ఓడించే శక్తి లేదన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్, బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్, తెలుగు రాష్ట్రాల్లో ఫ్లోరోసిస్ బాధితులు బరిలో ఉన్నారు. అనుచిత వ్యాఖ్యలతో కోర్టు థిక్కారానికి పాల్పడి అరెస్టయిన జస్టిస్ కర్ణన్ యాంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. జవాన్లకు నాసిరకం ఆహారం అందిస్తున్నారంటూ ఆరోపించిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ ఉద్యోగానికి రాజీనామా చేసి మోదీని నేరుగా 
ఢీ కొంటున్నారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి బలమైన అభ్యర్థిని రంగంలోకి దించలేదన్న అభిప్రాయం ఉంది.మోదీ పాలన, ఆయన చరిష్మా, గత ఐదేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై కమలం పార్టీ ధీమాగా ఉంది. కాశీ అభివృద్ధికి అలనేక చర్యలు చేపట్టామని పార్టీ చెబుతోంది. అయిదేళ్ల క్రితం కాశీకి, ఇప్పటి కాశీకి చాలా తేడా ఉంది. 24 గంటలూ విద్యుత్ సరఫరా అవుతుంది. దుమ్ము, ధూళితో ఉండే రహదారులు పరిశుభ్రంగా తయారయ్యాయి. అన్ని చోట్ల వీధిలైట్లు అందుబాటులోకి వచ్చాయి. గంగానది ప్రక్షాళన జరుగుతోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఇక్కడ జలరవాణా టెర్నినల్ ప్రారంభమయింది అని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ప్రజల్లో వ్యతిరేకత లేకపోలేదు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని, గంగానది ప్రక్షాళన మాటలకే పరిమితమయిందని కొందరు ప్రజలు చెబుతున్నారు. అయితే ఇవేమీ మోదీ విజయాన్ని అడ్డుకునే స్థాయిలో లేవన్నది వాస్తవం.

Related Posts