YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దీదీకి ఎందుకంత దడ

దీదీకి ఎందుకంత దడ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ ఆ రెండు జాతీయ పార్టీలను వెనక్కు నెట్టేసిందనే చెప్పుకోవాలి. ఒకప్పుడు బెంగాల్ లో కమ్యునిస్టులు, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉండేవి. దశాబ్దాల కాలం పాటు కమ్యునిస్టు సర్కార్ బెంగాల్ ను ఏలింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సయితం బెంగాల్ లో తొలి నుంచి పట్టు నిలుపుకుంటూనే వస్తోంది. అయితే మమత బెనర్జీ కాంగ్రెస్ నుంచి విడిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ కు అక్కడ అరకొర సీట్లే దక్కుతూ వస్తున్నాయి.దశాబ్దాల కాలం శాసించిన వామపక్షాలను దీదీ వెనక్కు నెట్టేశారు. వామపక్షాల కంచుకోటలో గడ్డిపూల జెండాను పాతేశారు. కమ్యునిస్టులు, కాంగ్రెస్ క్యాడర్ దాదాపుగా నిర్వీర్వమయిపోయింది. చెప్పుకోదగ్గ నేతలు కూడా ఇరు పార్టీల్లో లేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ పై కన్నేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీలు ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు బిగించే చర్యల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ పై కూడా దృష్టి కేంద్రీకరించారు.గత కొన్నేళ్లుగా ఆర్ఎస్ఎస్ చాపకింద నీరులా పశ్చిమబెంగాల్ లో పనిచేయడం ప్రారంభించింది. లోక్ సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీ ప్రధాన శత్రువుగా మారింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మోదీ, షాలను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ వేళ్లూనుకుంటే పెకలించడం భావించడం కష్టమని భావించిన మమత బెనర్జీ కమలం పార్టీపై తొలి నుంచి కత్తి కట్టారు. కాంగ్రెస్ తో పొత్తుకు ఇష్టపడని మమత బీజేపీతోనే తాడోపేడో తేల్చుకునేందకు సిద్దపడ్డారు.తాజాగా పశ్చిమ బెంగాల్ లో జరిగిన హింసాత్మక ఘటనలకు ఇరు పార్టీలు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమిత్ షా ర్యాలీని అడ్డుకోవడం, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం వంటి సంఘటనలు బెంగాల్ రాజకీయాన్ని మరింత వేడెక్కించాయనే చెప్పాలి. ఈ నెల 19వ తేదీన జరగనున్న చివరి దశ పోలింగ్ లో రెండు పార్టీలు అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధపడ్డాయి. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఇప్పుడు దీదీ వర్సెస్ మోదీ గా ఎన్నికలు 
మారిపోయాయి. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, ఏళ్లకు ఏళ్లు ఏలిన కమ్యునిస్టులు ఇప్పుడు కనుమరుగై పోయారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద దీదీకి బీజేపీ దడ 
ప్రారంభమయిందన్నది వాస్తవం.

Related Posts