యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికలు జరిగి నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు... దేశమంతా తిరిగారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల్ని కలిశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై చిన్నపాటి ఉద్యమమే చేశారు. ఐతే, వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇవేవీ చెయ్యలేదు. ఫలితాలు వచ్చాక చూద్దామన్నట్లు సైలెంట్‌గా ఉన్నారు. కచ్చితంగా గెలుస్తామన్న ఉద్దేశంతో ఉన్న ఆయన.. ఎందుకైనా మంచిదని తెరవెనక కొన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ప్రధానంగా ఈ నెల రోజుల్లో జగన్ ఐదు రకాల సర్వేలు చేయించారని సమాచారం. రైతులు, మహిళలు, యువత, పట్టణ ప్రజలు, పల్లె జనం ఇలా ఎవరెవరు ఎవరికి ఓటు వేశారన్న అంశంపై వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఐదు రకాల సర్వేలు చేయించి, వాటన్నింటినీ జాగ్రత్తగా విశ్లేషించారని తెలుస్తోంది. అన్ని సర్వేల్లోనూ టీడీపీ కంటే వైసీపీ ఎన్నో అంశాల్లో ముందు ఉన్నట్లు తేలడంతో జగన్‌లో మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని అంటున్నారు.వైసీపీ జరిపించిన సర్వేలన్నింటినీ క్రోఢీకరిస్తే... ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా 100 సీట్లు వస్తాయని తేలిందని సమాచారం. ఈ 100 సీట్లకు పైనే వస్తాయి తప్ప, ఒక్కటి కూడా తగ్గదని తేలడం వల్లే జగన్ పూర్తి సంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అలాగే లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలుండగా... వైసీపీకి కచ్చితంగా 18 సీట్లు దక్కుతాయని సర్వేల్లో తేలిదంట. అందువల్ల జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు కూడా వీలవుతుందని జగన్ సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. ఐతే... ప్రస్తుతం జాతీయస్థాయిలో కంటే... ఫోకస్ మొత్తం ఏపీపైనే ఉంచాలనీ, 2024లో ఎన్నికల ప్రచారం చెయ్యకపోయినా, ప్రజలే స్వయంగా తమకు ఓటు వేసేలా పాలన ఉండాలని జగన్ కోరినట్లు తెలిసింది.100 సీట్లు వస్తాయని తెలిసినా... మిగతా 75 స్థానాల్లో ఎందుకు వైసీపీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నదానిపై జగన్ లోతుగా చర్చించినట్లు తెలిసింది. టీడీపీ పట్ల ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత రాలేదనీ, ఇప్పటికీ ఆ పార్టీకి బలం ఉందనీ సన్నిహితులు చెప్పినట్లు సమాచారం. కోస్తా జిల్లాల్లో వైసీపీ బలపడినా, జనసేన ప్రభావం కొంతవరకూ కనిపిస్తోందనీ, అందువల్ల వైసీపీ గెలిచే అవకాశాలున్న చోట్ల జనసేన ఓట్లను చీల్చిందని సర్వే నిర్వాహకులు జగన్‌కు చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా మేజిక్ మార్క్ 88 కాబట్టి... సర్వేల్లో 100 దాకా వస్తాయని తేలింది కాబట్టి... ఒకవేళ ఓ ఐదారు సీట్లు తక్కువే వచ్చినా, అధికారం దక్కేది తమకేనన్న కాన్ఫిడెన్స్‌తో జగన్ పూర్తిగా సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది