యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
భారత జాతిపిత మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేను బీజేపీ నేతలు కీర్తించడంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈరోజు స్పందించారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డేతో పాటు బీజేపీ నేతలు నలిన్ కుమార్, ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ లు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని అమిత్ షా స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.తమ వ్యాఖ్యలను ముగ్గురు నేతలు వెనక్కి తీసుకుని క్షమాపణలు కోరిన విషయాన్ని షా గుర్తుచేశారు. ఏదేమయినా ఈ విషయంలో తాము మౌనంగా ఉండబోమనీ, ఈ ముగ్గురు నేతల వ్యాఖ్యలను బీజేపీ క్రమశిక్షణా కమిటీకి పంపామని చెప్పారు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ముగ్గురు నేతల నుంచి వివరణ కోరుతుందనీ, అనంతరం 10 రోజుల్లోగా తుది నివేదిక ఇస్తుందని తెలిపారు. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.నాథూరాం గాడ్సే దేశభక్తుడని బీజేపీ నేత, భోపాల్ లోక్ సభ సీటు అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గతంలో వ్యాఖ్యానించారు. తాజాగా బీజేపీ నేత నలిన్ కుమార్..‘గాడ్సే ఒక్కరినే చంపారనీ, కానీ రాజీవ్ గాంధీ మాత్రం 17,000 మందిని పొట్టనపెట్టుకున్నారు’ అని సెలవిచ్చారు. తాజాగా కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడుతూ.. గాడ్సే పట్ల ప్రస్తుతం జరుగుతున్న చర్చ విషయంలో తాను చాలా సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు.