YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అప్పుడు ఇందిరా... ఇప్పుడు మోడీ విపక్షాలను ఏకం చేస్తున్న నేతలు

 అప్పుడు ఇందిరా... ఇప్పుడు మోడీ విపక్షాలను ఏకం చేస్తున్న నేతలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భారత ప్రధాని నరేంద్రమోడీని దేశంలోని పార్టీలన్నీ ఏకైక ప్రత్యర్థిగా చూస్తున్నాయి. గతంలో ఎమర్జన్సీ తర్వాత ఇందిరను ఓడించడమనే ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకి వచ్చాయి. ఇప్పుడు మోడీ విషయంలోనూ అదే తరహా కనిపిస్తోంది. అయితే తమ సొంత అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే తిరిగి మోడీ ప్రధాని కాకుండా నిరోధించాలనేది వాటి లక్ష్యంగా మారింది. అప్పట్లో తమ అస్తిత్వాన్ని సైతం వదులుకుని జట్టు కట్టాయి. ఒకరకంగా చెప్పాలంటే నరేంద్రుడు బీజేపీకి వరమే. గతంలో ఎప్పుడూ కమలం పార్టీని చూసి ఇంతగా విపక్షాలు కలవరపడలేదు. తమ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుంది. మనుగడకే ముప్పు వాటిల్లుతుందని భావించలేదు. దాంతో సిద్దాంతపరంగా పరస్పరం విభేదించుకునే పార్టీలు సైతం ఏకమవుతున్నాయి. ఈసారి బీజేపీని నిరోధించకపోతే రానున్న అయిదేళ్లలో తమ పార్టీల ఆనవాళ్లే మిగలవేమో అన్నంత భయాందోళనలు ఆయా పార్టీల అధినేతల్లో వ్యక్తమవుతున్నాయి. అందరినీ కలిపి ముందుగా ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించడంపై దృష్టి సారిస్తున్నారు. ఈవిషయంలో నేరుగా రంగంలోకి దిగాలని సోనియా గాంధీ భావిస్తున్నారు. గతంలో పదేళ్లపాటు యూపీఏ కూటమి విజయవంతంగా నడవడంలో సోనియానే కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు మరోసారి ఆమెనే నమ్ముకోవాలని విపక్షాలు కోరుకుంటున్నాయి.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. పిలిచినా పిలవకపోయినా విపక్షాల ఐక్యత పేరిట తటస్థపార్టీలు రంగంలో ఉన్నచోట్ల ప్రచారం చేసి వస్తున్నారు. యూపీఏ కూటమికి మద్దతుగా ఆయన ఈ తతంగం నడుపుతున్నారు. ఎందుకంటే మోడీ ఫోబియా ఆయనను పూర్తిగా ఆవరించింది. తిరిగి మోడీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే పార్టీగా టీడీపీకి, వ్యక్తిగతంగా తనకు తీవ్ర నష్టం చేకూరవచ్చని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు. అందుకే అడగకపోయినా కాంగ్రెసు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే మరిన్ని పార్టీలను యూపీఎ కూటమిలో భాగం చేయడానికి చంద్రబాబు సరిపోరనేది కాంగ్రెసు వర్గాల భావన. ఈసారి టీడీపీ కనుక కనీసం 15 స్థానాలు గెలుచుకోకపోతే జాతీయంగా పెద్ద ప్రాధాన్యం ఉండదు. వైఎస్సార్ కాంగ్రెసుపార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే అత్యధిక ఎంపీ స్థానాలను కూడా ఆ పార్టీయే గెలుచుకుంటుంది. అటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడితో కాంగ్రెసుకు, యూపీఏకు పెద్దగా అవసరం ఉండదు. పైపెచ్చు తెలుగురాష్ట్రాల్లో టీఆర్ఎస్, వైసీపీలు తెలుగుదేశంపార్టీ అధినేతతో తీవ్రంగా విభేదిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మద్దతు కావాలంటే చంద్రబాబును దూరంగాపెట్టకతప్పకపోవచ్చు. మమత, మాయావతి, అఖిలేష్ ల మద్దతు సమీకరణకు కాంగ్రెసు ఇప్పటికే స్వీయప్రయత్నాలు మొదలుపెట్టింది.మమత, మాయావతి, అఖిలేష్ లు దాదాపు కాంగ్రెసు నేత్రుత్వంలోని కూటమిని సమర్థించేందుకు సిద్ధమవుతున్నారు. సోనియా గాంధీ నేరుగా తమను సంప్రతించి కనీస అవగాహన ఒప్పందానికి వస్తే సరిపోతుందంటున్నారు . ఈ విషయంలో చంద్రబాబు నాయుడికంటే సోనియాకే ఎక్కువ క్రెడిబిలిటీ ఉందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. రాహుల్ ప్రధాని అయితే తమకేమీ అభ్యంతరం లేదంటూ మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటన చేశారు. అఖిలేష్ కు రాహుల్ తో నేరుగా సంబంధాలున్నాయి. గతంలో కాంగ్రెసు, సమాజ్ వాదీ పార్టీలు కలిసి పోటీ చేయడంలో ప్రియాంక కీలక పాత్ర పోషించారు. మాయావతి సైతం సోనియా మాటను తోసిపుచ్చరని విశ్వసిస్తున్నారు. సోనియా మిత్రపక్షాలకు ఇచ్చే గౌరవం, ప్రవర్తనలో సంయమనం అడ్వాంటేజ్ గా మారుతుందంటున్నారు. గతంలో మమత, మాయావతులు రాహుల్ గాంధీతో రాజకీయ వ్యవహారాలు మాట్లాడటానికి ఇష్టపడలేదు. సోనియా అయితే సరే అన్నారు. ఇప్పుడు మరొకసారి ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఆమె రంగంలోకి దిగకతప్పదని పరిశీలకులు చెబుతున్నారు.నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశముంటే కచ్చితంగా అటువైపే మొగ్గు చూపాలని టీఆర్ఎస్, వైసీపీ భావిస్తున్నాయి. అటు యూపీఏ, ఇటు ఎన్డీఏలు రెండూ మెజార్టీకి దూరంగా మిగిలిపోతే ఒక ప్రయత్నంగా ఫెడరల్, సెక్యులర్ ఫ్రంట్ కట్టాలని కేసీఆర్ బలంగా ప్రయత్నాలు చేశారు. సక్సెస్ కాలేకపోయారు. ఒకరకంగా విసిగిపోయారనే చెప్పాలి. ఇప్పుడు వైసీపీ, తెరాసలను సైతం యూపీఏ కూటమికి ఆహ్వానించేందుకు కాంగ్రెసు పావులు కదుపుతోంది. బీజేపీ అధికారంలోకి రాకపోతే కాంగ్రెసుతో అయినా పర్వాలేదనే ధోరణి ఈరెండు పార్టీల్లో సైతం కనిపిస్తోంది. ప్రత్యేక హోదాకు అనుకూలంగా కాంగ్రెసు నిర్ణయం తీసుకుంది కాబట్టి వైసీపీకి ఎటువంటి ఇబ్బంది లేదు. అందులోనూ ఏపీలో వైసీపీకి కాంగ్రెసు పార్టీ ప్రధాన ప్రత్యర్థి కాదు. తెలంగాణను ఇచ్చిన పార్టీ కాంగ్రెసు కాబట్టి కృతజ్ఞతగా కేంద్రంలో మద్దతు ఇచ్చేందుకు టీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బంది లేదు. అయితే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసు. టీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి , తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి ఆ పార్టీ అర్హతను కోల్పోతుంది. మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో పునరధికారం తెచ్చుకోకపోతే రాజకీయ పరిణామాల్లో మార్పులు టీడీపీకి సవాల్ గా మారతాయి. అటు ఎన్డీఏ దూరం పెడుతుంది. ఇటు యూపీఏ నంబర్ గేమ్ నే నమ్ముకుంటుంది.

Related Posts