యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కలిసి వచ్చే అవకాశాన్ని గమనించడం, దానిని అందుకోవడం … పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడం రాజకీయాల్లో అవసరం. దీనిని సరైన విధంగా వినియోగించుకోగలిగినవారు అధికార పీఠాన్ని అందుకోగలుగుతారు. లేకపోతే ముంత ఒలకపోసుకుంటారు. అక్కడే రాజకీయ చాణక్యం, నైపుణ్యం ఆధారపడి ఉంటాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. రెండు కూటములు అధికారానికి ఎంతోకొంత దూరంలో నిలిచిపోతే ఏం జరగబోతోందన్న ఉత్కంఠ పట్టి కుదిపేస్తోంది. మోడీ వర్సస్ రాహుల్ అనేది పైకి కనిపించే పోటీ. ప్రధాని రేసులో పోటీ పడుతున్న రెండు కూటములకు వారు ప్రాతినిధ్యం వహించడంతో అది సహజమే.అయితే పెద్దపార్టీలను పక్కనపెడితే రెండో వరస పోటీదారుల్లో ఇద్దరు మహిళా రెబల్ పొలిటిషియన్లకు అద్భుత అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరి అవకాశాలకు మరొకరు గండి కొట్టకపోతే ఇద్దరూ ఒకే మాటమీద నిలవగలిగితే అధికారపీఠం అందుకునేందుకు పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి.బెంగాల్ టైగర్ మమత బెనర్జీ రాజకీయ సంచలనం. పోరాటమే పథంగా సొంత కాళ్లపై ఎదిగిన నాయకురాలు. కమ్యూనిస్టులతో పోరాటంలో కాంగ్రెసు వెనకబడిపోతోందని భావించి సొంతపార్టీ పెట్టుకున్న ధీరవనిత. వామపక్షాలకు ఎదురులేని రాష్ట్రంపై పోరాటంతో పట్టు సాధించిందామె. కామ్రేడ్ల కోటలను బద్దలు కొట్టి సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అటు వామపక్షాలు, ఇటు మాత్రుపార్టీ కాంగ్రెసుకు చరమగీతం పాడించిందామె. రాజకీయ దుర్గం ఆమె సొంతమైపోయింది. కాంగ్రెసు,కామ్రేడ్లు కలిసి పోటీ చేసినా ఆమె విజయాన్ని నిలువరించలేకపోతున్నారు. బీజేపీ మాత్రమే పోటీనివ్వగల స్థితి క్రమేపీ ఏర్పడుతోంది. ఈ దశలో ప్రధాని రేసులోకి సహజంగానే దూసుకొచ్చేశారు మమత. ఒకవేళ యూపీఏ, ఎన్డీఏ లలో ఏ కూటమికి తగినంత బలం సమకూరకపోతే ఫైర్ బ్రాండ్ మమతను ఎంచుకోవడానికి కాంగ్రెసుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే పశ్చిమబంగలో తాము అధికారంలోకి వచ్చే అవకాశం ఎటూ లేదు. మరోవైపు బీజేపీ ఆ రాష్ట్రంలో బలపడితే కాంగ్రెసుకు జాతీయంగా కష్టకాలమే. అందువల్ల పరోక్షంగా బీజేపీని నిరోధించగల శక్తిగా మమతకు అవకాశం తలుపుతట్టవచ్చు. సాంఘికంగా, ఆర్థికంగా పెద్దగా బలం లేకపోయినా అతిపెద్ద రాష్ట్రానికి మాయావతి ముఖ్యమంత్రి కావడాన్ని పీవీ నరసింహారావు గతంలో మిరకిల్ ఆఫ్ డెమొక్రసీగా అభివర్ణించారు. తాజాగా ప్రధానమంత్రి అయ్యేందుకూ ఆమెకు ఎప్పుడూ లేనంత అవకాశం ఏర్పడిందనే చెప్పాలి. ఇప్పటికే సమాజ్ వాదీ మాయావతి ప్రధాని అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు పలుకుతోంది. ఎస్సీ సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకోవడానికి వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయపార్టీలు ఆమె అభ్యర్థిత్వానికి అభ్యంతరాలు చెప్పకపోవచ్చు. పైపెచ్చు మాయ రేసులోకి వస్తే మద్దతు ఇవ్వడానికి పోటీలు పడతాయి. మమత వంటి వారు అడ్డుచెప్పకపోతే కూటములకు చెందని తటస్థ అభ్యర్థిగా అద్రుష్ట జాతకురాలు కావచ్చు. బీజేపీ, మోడీ పశ్చిమబంగలో మమతను టార్గెట్ చేస్తున్నారని మాయావతి గట్టిగా గళమెత్తుతున్నారు . కేంద్రానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీకి మద్దతుగా నిలుస్తున్నారు. మమతను మచ్చిక చేసుకోవడమే ఈ వ్యూహంలో భాగమనేది రాజకీయ పరిశీలకుల అంచనా. నిజంగానే వీరిద్దరూ సహకరించుకుంటే ప్రధాని రేసులో ఎవరో ఒకరికి అవకాశాలు మెరుగుపడతాయి. ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి ఐకాన్. అతిపెద్ద రాష్ట్రానికి ప్రతినిధి. మరొకరు దేశంలో పెద్దరాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమబంగలో తిరుగులేని నాయకురాలు.పెద్దగా ప్రచారంలో లేకుండా హఠాత్తుగా అవకాశం కలిసొచ్చే నేతలకూ కొదవ లేదు. గతంలో ఐకే గుజ్రాల్, దేవెగౌడ వంటివారికి అలాంటి అదృష్టమే పట్టింది. రాజకీయాల నుంచి విరమించుకుని ఇంట్లో కూర్చుంటే పీవీనరసింహారావుకు ప్రధానిపదవీయోగం పట్టింది. అటువంటి అవకాశం ఎవరికైనా తగలవచ్చు. చంద్రబాబు నాయుడు సైతం ఆ రేసులో ఉన్నారని జాతీయ మీడియా కోడై కూస్తోంది. అయితే ఏపీలో టీడీపీ ఎంతోకొంత నిరూపించుకుంటేనే ఆ లక్ దక్కుతుంది. లేకపోతే కాంగ్రెసుకు మద్దతుగా ఆయన చేస్తున్న ప్రచారం సైతం ఆయనకు పెద్దగా కలిసిరాదు. నంబర్ గేమ్ లో పరిచయాలు పక్కకు పోతాయి. గతంలో నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఉన్నప్పటికీ టీడీపీ ఓడిపోవడంతో 1989లో ఎన్టీయార్ ను పక్కనపెట్టేశారు. జాతీయంగా అన్నిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చిన ఆయన ప్రాచుర్యం ఒక్క పరాజయంతో ఆవిరైపోయింది. అందుకే ఇంట గెలవడమనేది రచ్చ గెలవడానికి రాజమార్గం. చంద్రబాబు నాయుడికి ఆ అవకాశం దక్కుతుందో లేదో కాలమే తేల్చాలి. అయితే మమత,మాయలు ఒక అవగాహనకు వస్తే…సంకీర్ణయుగం లో వారికి చాన్సులు అధికంగా ఉన్నాయనేది పరిశీలకుల అంచనా.