యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బయటకు వస్తాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించేందుకు జాతీయ మీడియా సిద్ధమయింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉంటాయనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈనెల 19వ తేదీన తుది దశ పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఆరుగంటలకు ఎగ్జిట్ పోల్స్ ను అన్ని మీడియా సంస్థలు ప్రకటించనున్నాయి.అవన్నీ ఒక ఎత్తయితే ఆంధ్రప్రదేశ్ లో సర్వేల రాయుడు లగడపాటి రాజగోపాల్ ఏం చెబుతారో అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి గతంలో చేసిన అనేక సర్వేలు నిజమయ్యాయి. ఢిల్లీ, కర్ణాటక, 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ లగడపాటి రాజగోపాల్ సర్వేలు నిజమయ్యాయి. అప్పటి నుంచి ఆయన సర్వేలను పొలిటికల్ పార్టీలే కాదు ప్రజలు కూడా నమ్ముతారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. రాజకీయాల్లో తాను ఇప్పడు లేనని, ఏపార్టీకి చెందిన వాడిని కాదని లగడపాటి పదే పదే చెబుతుంటారు. అయితే లగడపాటి రాజగోపాల్ సంస్థ తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన సర్వే తప్పయింది. మహాకూటమికి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని లగడపాటి చెప్పినా తిరిగి కె.చంద్రశేఖర్ రావు అధికారంలోకి వచ్చారు. అయితే లగడపాటి తన సర్వే ఫెయిల్ కావడానికి కొన్ని కారణాలను చెప్పారు. లక్షల సంఖ్యలో ఓట్లను తొలగించడం వల్లనే సర్వే ఫలితాలు తాము అనుకున్నట్ల రాలేదని లగడపాటి చెప్పుకొచ్చారు.ఇక ఏపీ రిజల్ట్ కు వచ్చేసరికి లగడపాటి సంయమనం పాటించారు. తెలంగాణ ఎన్నికలకు, కౌంటింగ్ కు మధ్య పెద్దగా సమయం లేకున్నా కౌంటింగ్ ముందే లగడపాటి సర్వేను బయటపెట్టారు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి ఆయన మౌనంగా ఉన్నారు. ఈ నెల 19వ తేదీన తన సర్వే ఫలితాలను ప్రకటిస్తానని చెప్పారు. అప్పటికీ ఆయన ఒక హింట్ అయితే ఇచ్చారు. సంక్షేమ పథకాలను, అభివృద్ధిని చూసే ప్రజలు ఓటేశారని లగడపాటి చెప్పడం చూస్తే ఈ సర్వే ఫలితాలు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాయనే అనుకోవాలి. చంద్రబాబునాయుడు ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షల్లో చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కౌంటింగ్ కు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉంది. అయినా చంద్రబాబు తన వద్ద నాలుగు సర్వేల ఫలితాలు ఉన్నాయనడం తెలుగుతమ్ముళ్లకు కొంత ఊరటనిస్తోంది. నాలుగుసర్వేల్లోనూ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఫలితాలు వచ్చాయని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు.ఇందులో రెండు సర్వేలు ప్రత్యేక సంస్థ ద్వారా చేయించినవి కాగా, ఒక సర్వే మాత్రం ప్రముఖ మీడియా నిర్వహించిన సర్వే అని తెలుగుదేశం పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పేరున్న మీడియా జరిపిన సర్వేలో చంద్రబాబుకు 95 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో అప్పట ినుంచి చంద్రబాబు కొంత ఉత్సాహంగా ఉన్నారంటున్నారు. దీంతో పాటు మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలో కూడా బాబుకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయంటున్నారు.ఇలా నాలుగు సర్వేలు తనకు అనుకూలంగా రావడంతో చంద్రబాబు పార్టీ సమీక్షల్లో క్యాడర్ కు, నేతలకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నారు. సమీక్షలకు వెళ్లి వచ్చిననేతలు బాబులో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెబుతుండటం విశేషం. అందుకే ఆయన ఈసారి తన పనితీరు డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. ఎవరికీ భయపడే ప్రస్తక్తి లేదని అంటున్నారు. అంతేకాదు ఇకపై కార్యకర్తల అభిప్రాయాలనే పరిగణనలోకి తీసుకుంటానని, సీనియర్ నేతలయినా ఎన్నికల్లో వచ్చే ఓట్లను బట్టే వారికి పదవులు ఉంటాయని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు నాలుగు సర్వేలు ఏమిటో తెలుసుకునేందుకు టీడీపీ నేతలు తెగ ఉత్సాహం చూపిస్తుండటం విశేషం.