నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రి.. చూసేందుకు విశాలమైన ప్రాంతం. కార్పొరేట్ భవనాన్ని తలదన్నే రీతిలో ఆధునిక హంగులతో నిర్మితమైన సుందరమైన భవనం. నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారూ పోతుంటారు. ప్రసూతి, అత్యవసర సేవల కోసం వచ్చే రోగులూ అదేసంఖ్యలో ఉంటారు. ఇంతటి రద్దీ దవాఖానాల్లో నీళ్లకు కరువొచ్చింది. కనీస అవసరాలకు కూడా ఆస్పత్రిలో నీళ్లు ఉండవు. అత్యవసరమైతే సులభ్‌కాంప్లెక్స్‌కు పరుగుతీయాల్సిందే. గొంతు తడుపుకునేందుకు రూ.వందల్లో ఖర్చు చేయాల్సిందే. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి సహా ఆర్మూర్, బోధన్ లాంటి ఆస్పత్రుల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో రోగులు, సహాయకులు దాహంతో అల్లాడిపోతున్నారు. ఈ పెద్దాస్పత్రికి నిత్యం 1500 మందికిపైగా ఔట్‌పేషెంట్లు వస్తుంటారు. మరో 500 మంది ఇన్‌పేషెంట్లుగా ఉన్నారు. వారికితోడు ఇద్దరు చొప్పున మరో వెయ్యి మంది సహాయకులు ఆస్పత్రిలో ఉంటున్నారు. ఇలా 3 వేల మంది ఉండే ఆస్పత్రి మొత్తానికి ప్రస్తుతం 8వేల లీటర్ల నీటిశుద్ధి కేంద్రం ఉంది. ఇటీవల ఈ కేంద్రానికి మరమ్మతులు చేసినా నీటిశుద్ధి కేంద్రం నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. నీళ్లు అయిపోతే మళ్లీ నింపడం లేదు. ఆస్పత్రి మరుగుదొడ్లలో అంతే సంగతులు. ఫలితంగా రోగులు ఆస్పత్రి ఎదురుగా ఉన్న సులభ్‌కాంప్లెక్స్‌కి డబ్బులిచ్చివెళ్లాల్సి వస్తున్నది. రోజు మూడు, నాలుగు అంతస్థులు దిగి రావాలంటే ఇబ్బందిగా ఉన్నదని రోగులు ఆవేదన చెందుతున్నారు. వంద పడకల ఆస్పత్రిగా ఉన్న ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకేచోట కుళాయి ఉండటం, నీరు ఉప్పగా రావడంతో ఎవరూ తాగడం లేదు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందుతున్నా మంచినీళ్లు మాత్రం బయట నుంచి కొనుగోలు చేస్తున్నామని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోధన్ ఆస్పత్రిలో ఇటీవల నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేయడంతో రోగులకు కొంత ఉపశమనం లభించినట్టయింది.కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో మూడు బోర్లు వేయించినా ఈ వేసవిలో రెండు బోర్లు వట్టిపోయాయి. ఒకటిమాత్రమే నామమాత్రంగా పనిచేస్తున్నది. దీంతో మున్సిపల్‌శాఖ నుంచి రెండు ట్యాంకర్ల నీరు సరఫరా చేస్తున్నారు. మరో రెండు ట్యాంకర్ల నీటిని ప్రయివేటుగా కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన నీటిని నేరుగా డయాలసిస్ పేషెంట్లకు సరఫరా చేస్తున్నారు. దీంతో సంపులో నిల్వ చేసిన నీరు పేషెంట్లకు సరిపోవడం లేదు. ఈ ఆస్పత్రిలో 180 మంది ఇన్‌పేషెంట్లు ఉండగా సుమారు ఒక పేషెంటు తరుపున కనీసం ఇద్దరు ఉంటున్నారు. రోగులతో కలిపి మొత్తం 540 మంది ఉంటున్నారు. ప్రతిరోజూ ఔట్‌పేషెంట్ విభాగంలో సుమారు వెయ్యి మంది వరకు పేషెంట్లు చికిత్స కోసం వస్తున్నారు. వారికి తాగునీరు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారు.