YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

మహిమాన్విత వీరాచల రామచంద్రుడు

 మహిమాన్విత  వీరాచల రామచంద్రుడు

యువ్ న్యూస్ కల్చరల్ బ్యూరో:

తెలంగాణాలోని జీడిక్కల్ లో  వీరాచల రామచంద్రస్వామివారి దేవాలయం వుంది.
ఇక్కడే , త్రేతాయుగంలో శ్రీ రాముడు తన వన వాస కాలంలో  బంగారు మాయ లేడిగా వచ్చిన రాక్షసుడు మారీచుణ్ణి చంపిన స్ధలంగా పురాణ కధలు చెపుతున్నాయి. మరణించేముందు
మారీచుని దాహం తీర్చడానికై  గంగతో సమానమైన ఒక పుష్కరిణిని (తీర్ధ గుండం) శ్రీరాముడు యిక్కడ సృష్టించాడు. ఈ ప్రదేశంలోనే వీరా అనే సాధువుకు ప్రత్యక్షమై వీరాచల రామచంద్ర స్వామిగా వెలియడం జరిగింది. మారీచ ,సుబాహులు తాటకి పుత్రులు. వైకుంఠం లో ద్వారపాలకులైన జయ ,విజయుల వద్ద తన పూర్వజన్మ లో
చిత్రరధుడు అనే పేరుతో సేవ చేసిన ఒక గంధర్వుడు తను చేసిన ఒక తప్పు కారణంగా శ్రీ మహావిష్ణువు , అతనిని  రాక్షసుని గా పుట్టమని శపించాడు. ఆ రాక్షసుడే మారీచుడు.
శ్రీ రాముని ద్వారా  ఆ గంధర్వునికి శాప విమోచనం జరిగింది. మారీచుడు మరణ సమయంలో,తన చివరి కోరికగా రాముని పాదతీర్ధం అనుగ్రహించమని కోరాడు.
శ్రీ రాముడు తన కాలి బొటనవేలు తో మారీచుడు పడి వున్న రాయిని బలంగా త్రొక్కగా అక్కడ ఒక పల్లం ఏర్పడి అందునుండి నుండి వచ్చిన నీరు  ఒక పెద్ద పుష్కరిణిగా
మారి  ఉత్తర దిశ గంగగా ప్రవహించింది. ఆ పవిత్ర జలం త్రాగి మారీచుడు సద్గతి పొందాడు.
ఈ ఆలయంలో శ్రీ రామనవమికే కాకుండా, తరువాత వచ్చే కార్తీక పౌర్ణమి కి , అమవాస్యకి, ఆ తర్వాత వచ్చే పునర్వసు నక్షత్ర దినమున కూడా సీతా రామ కళ్యాణోత్సవాలు జరుపుతారు.
సీతారాముల కళ్యాణ వైభవాన్ని తిలకించడానికి వేలాది భక్తులు తరలి వస్తారు.
కళ్యాణోత్సవ సమయంలో  తలంబ్రాలవేడుకకోసం  మంగళాక్షతలు తయారుచేసేప్పుడు,
ఆలయ గిడ్డంగిలో వున్న బియ్యమంతా  పసుపురంగు మంగళాక్షతలుగా
మారిపోవడం  అద్భుతంగా ,  విశేష మహిమగా చెపుతారు.  జీడిక్కల్  ఆలయం తెలంగాణలోని, హైదరాబాదు నుండినూట నలభై ఐదు కి.మీ.దూరంలో , వరంగల్ నుండి ఇరవై ఎనిమిది కి.మీ. దూరంలో వున్నది. ఉదయం ఆరు గంటలనుండి, పన్నెండు గంటల వరకు, సాయంకాలం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనార్ధం  తెరచి వుంటుంది.

Related Posts