YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిడ్నీ రాకెట్ దర్యాప్తు ముమ్మరం

కిడ్నీ రాకెట్ దర్యాప్తు ముమ్మరం

విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసుపై దర్యాప్తుపై నివేదిక మరో రెండు రోజుల్లో జిల్లా అధికారులకు చేరేందుకు అవకాశాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్దంగా కిడ్నీ మార్పిడి జరిగిందని ఫిర్యాదు రావడంతో ముందుగా జిల్లా త్రిసభ్య కమిటీ వేసి వాస్తవాలపై నిగ్గుతల్చేందుకు సభ్యులు ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు.  శ్రద్ద ఆసుపత్రి కిడ్నీ రాకెట్లో యాజమాన్య ప్రతినిధుల్లో కీలకమైన ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా, మరికొందరు అందుబాటులో లేరు. కలెక్టర్‌ ఇచ్చిన గడువు సమీపిస్తుండంతో త్రిసభ్య కమిటీ సభ్యులు మహారాణిపేట పోలీసుస్టేషన్‌ కు వెళ్లారు. అక్కడ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. పోలీసు వర్గాలు శ్రద్ధ ఆసుపత్రి నుంచి తీసుకెళ్లిన రికార్డులను అక్కడే పరిశీలించారు. వీటి ఆధారంగా త్రిసభ్య కమిటీ ప్రాథమిక నివేదికను తయారు చేస్తున్నట్లు కేజీహెచ్ సూపరిడెంట్ అర్జున్ తెలిపారు. ఇక  డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ తిరుపతిరావు, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అర్జున, జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నాయక్‌ లతో కూడిన కమిటీ తొలి దశలో శ్రద్ధ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అంశాలపై ఆరా తీస్తోంది. రెండో దశలో నగరంలో అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆసుపత్రులను సందర్శించనుంది. వారం వ్యవధిలో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఇప్పటికే  ఆదేశించారు. ఇంకా రెండు  రోజులే గడువుండడంతో రికార్డులను పరిశీలించి, తప్పిదాలను విశ్లేషించి నివేదిక రూపొందించేపనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని రకాల రికార్డులను సైతం తారుమారుచేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా మార్పిడి చికిత్సలు జరిగాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీటి ఆధారంగా వైద్య, సాంకేతికంగా జరిగిన తప్పిదాలను వైద్య బృందం ఆరా తీస్తోంది.వాస్తవాలను వెలికి తీసేలా త్రిసభ్యకమిటీ సభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.అయితే మరో రెండు రోజుల్లో నివేదికను ఇచ్చేందుకు సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

Related Posts