యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఒక్క రోజు ముందే పార్టీ సీనియర్లతో సోనియా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీకి సీనియర్ నాయకులతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులను, ఇంచార్జులను ఆహ్వానించారు. అయితే ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఎన్డీయే కూటమిలో లేని పార్టీలతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై చర్చించనున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశం లేదని పలు సర్వే నివేదికలు వెల్లడించిన నేపథ్యంలో.. ఫలితాల అనంతరం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోమారు అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో 23వ తేదీన ప్రతిపక్ష పార్టీల నేతలందరితోనూ సోనియా సమావేశం కానున్నారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నాయకులందరికీ సోనియా లేఖలు రాసి ఆహ్వానించారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, జనతాదళ్ (సెక్యూలర్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ, ఎన్సీపీ నాయకుడు శరద్‌పవార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు సోనియా లేఖలు రాశారని పార్టీ వర్గాలు తెలిపాయి. తృణమూల్, ఆర్జేడీ నేతలను కూడా ఆమె ఆహ్వానించినట్టు పేర్కొన్నాయి