యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఏపీ భవన్ నుంచి రాహుల్ నివాసానికి వెళ్లిన ఆయన కాసేపు ప్రత్యేకంగా సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈనెల 19న తుదివిడత పోలింగ్ ముగియనుండటంతో అదేరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. దీన్నిబట్టే కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందన్న దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. అందువల్ల మే 23న ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన కార్యాచరణపై రాహుల్, చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.దాదాపు గంటపాటు సాగిన ఈ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ నెల 23న ఫలితాల ప్రకటన సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఓ అవగాహనకు వచ్చారు.ఈ సారి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మ్యాజిక్ ఫిగర్ 272కు ఓ 50 సీట్లు దూరంగా ఉండిపోతుందన్న విశ్లేషణల నేపథ్యంలో తటస్థులను ఆకర్షించే విషయమై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత శరద్‌పవార్, శరద్‌యాదవ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆయన సోనియాగాంధీ కూడా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఆ పని అయ్యాక సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈనెల 23న వెలువడే ఫలితాలు కేంద్రంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయన్న అంచనాతో కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు చేయాల్సిన కసరత్తుపై వీరితో చర్చించినట్లు సమాచారం.