YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రధాని ఎవరైనా కాంగ్రెస్ తోనే ఉంటాము

ప్రధాని ఎవరైనా కాంగ్రెస్ తోనే ఉంటాము

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్‌డీ దేవెగౌడ తన పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సహా కుటుంబసమేతంగా దేవెగౌడ తిరుమలకు చేరుకున్నారు. అనంతరం ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దేవెగౌడకు టీటీడీ అధికారులు ఆలయ సంప్రదాయం మహాద్వారం వద్ద స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు దేవగౌడకు ఆశీర్వచనాలు పలికారు. దేవెగౌడ ఏటా తన పుట్టిన రోజు నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. స్వామి దర్శనం పూర్తయిన తర్వాత బయటకొచ్చిన దేవెగౌడ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ పయనం కాంగ్రెస్‌తోనేనని మరోసారు స్పష్టం చేశారు. ఈసారి ప్రధాని పదవి ఎవరిని వరిస్తుందో తెలియదు కానీ, తాము మాత్రం కాంగ్రెస్‌ వెంటే ఉంటామని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదని కుండబద్దలుకొట్టారు. గత 35 నుంచి 40 ఏళ్లుగా మే 18న తిరుమలకు విచ్చేసి, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నానని మాజీ ప్రధాని అన్నారు. దేశ ప్రజలకు సేవచేయడానికి మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటానని తెలిపారు. దేవ ప్రజల మధ్య ఎలాంటి కులమత ఘర్షణలు లేకుండా, శాంతియుతంగా మెలగాలని ప్రార్థించానని, సకాలంలో వర్షాలు కురిసి కర్ణాటక, తమిళనాడు రైతుల సాగునీటి సమస్యలు తీరేలా చూడాలని స్వామిని వేడుకున్నట్టు దేవెగౌడ వెల్లడించారు.  సీఎం కుమారస్వామి మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. తన అంచనా ప్రకారం కాంగ్రెస్-జేడీఎస్ కూటమి 18కిపైగా స్థానాల్లో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీకే తమ మద్దతు ఉంటుందని, ఫలితాల అనంతరం ఎలాంటి మార్పు ఉండబోదని కుమారస్వామి ఉద్ఘాటించారు. ముందు నుంచి తాము కాంగ్రెస్ వెంటే ఉన్నామని, నిర్ణయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవన్నారు

Related Posts