YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చివరి దశ పోలింగ్ కు అంతా సిద్ధం

చివరి దశ పోలింగ్ కు అంతా సిద్ధం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మరి కొన్ని గంటల్లో సార్వత్రిక సమరం..ముగియనుంది.లోక్‌సభ చివరిదశ పోలింగ్  అంతా సిద్ధమైంది. 70 రోజులకు పైగా దేశవ్యాప్తంగా జరిగిన ప్రచార హోరుకు తెర పడింది. 7-రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 59 స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరుగనుంది. చివరి దశ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ తదితరులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.పంజాబ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ లలో 13 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్, మధ్యప్రదేశ్‌ల్లో ఎనిమిది, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు, జార్ఖండ్‌లో మూడు, ఛండీగఢ్‌లో ఏకైక స్థానంలో పోలింగ్ జరుగనున్నది. గత మార్చిలో గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ మృతితో ఖాళీ ఏర్పడిన పనాజీ అసెంబ్లీ స్థానానికి కూడా ఆదివారం పోలింగ్ జరుగనున్నది. కోల్‌కతాలో అమిత్ షా రోడ్ షోలో బీజేపీ, తృణమూల్ మధ్య హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో నిర్దేశిత సమయానికి 20 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఈసీ ఆదేశించింది. ఈ విడుత ఎన్నికల బరిలో అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జఖడ్, ఆప్ పంజాబ్ శాఖ కన్వీనర్ భగవత్ మాన్, కేంద్ర మంత్రులు హర్‌సిమ్రత్ కౌర్, హర్దిప్ సింగ్ పూరీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులు పవన్‌కుమార్ బన్సాల్, మనీశ్ తివారీ ఉన్నారు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి మళ్లీ పోటీ చేస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా, భోజ్‌ పురి నటుడు రవికిషన్  సహా మరో ఏడుగురు బీజేపీ నేతల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు నిర్దేశిస్తాయి. మహాకూటమి తరఫున పోటీలో ఉన్న ఎనిమిది మంది ఎస్పీ, ఐదుగురు బీఎస్పీ అభ్యర్థులు బీజేపీకి గట్టి పోటీనిస్తున్నారు. బీహార్‌లోని ఎనిమిది స్థానాల్లో పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున శత్రుఘ్న సిన్హా, బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీ పడుతున్నారు. జార్ఖండ్‌లోని దుమ్కా నుంచి జేఎంఎం అధినేత శిబూసోరెన్, బీజేపీ అభ్యర్థి సునీల్ సోరెన్‌తో తలపడుతున్నారు.మధ్యప్రదేశ్‌ లోని రాత్లాం, ఖండ్వాల నుంచి కేంద్ర మాజీ మంత్రులు కాంతిలాల్ భూరియా, అరుణ్ యాదవ్ మరోసారి తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పంట రుణ మాఫీ అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కమల్‌నాథ్ ప్రభుత్వం రుణ వసూళ్ల కోసం నోటీసులు జారీ చేస్తూ, పోలీసులను పంపుతున్నదని ప్రధాని మోదీ పదేపదే ప్రచారం చేశారు. ప్రతిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. పంట రుణ మాఫీ పథకంతో కొన్ని లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు స్థానాలకు 45 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.చివరి దశ పోలింగ్ కావడంతో..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఈసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

Related Posts