విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.కోట్ల బకాయిలపై ఆశలు ఆవిరయ్యాయి. వాటి కోసం అధికారులు, పాలకులు చాలా రోజులుగా తీవ్రంగా యత్నిస్తున్నారు. ప్రసుత్తం ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఒక్క నయాపైసా కూడా విడుదలకాని పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో నగర మేయర్ తాజాగా పలువురు ప్రభుత్వ కార్యదర్శులను కలిసి నిధులు విడుదల చేయాలని అభ్యర్థించారు. అయినా వారి నుంచి ఎటువంటి హామీ దక్కకపోగా, కొన్ని రకాల నిధుల విడుదలపై ఆశలు వదులు కోవాలంటూ వారు బాంబు పేల్చారు. దీంతో నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కార్పొరేషన్ కు వృత్తి పన్ను కింద రూ.కోట్లు రావాల్సి ఉంది. పలు ప్రభుత్వ సంస్థలు, శాఖల నుంచి ఆస్తి పన్నుల నష్టపరిహారాలుగా మరిన్ని రూ.కోట్లు బకాయిలుగా మిగిలాయి. ఇక అత్యంత కీలకంగా వృత్తి పన్నుల కింద నగర వాసులు చెల్లిస్తున్న సొమ్ములు ఇక్కడి అధికారుల తప్పిదాలతో నేరుగా ప్రభుత్వం చెంతకు చేరుతున్నాయి. మరోవైపు పలు రకాల నష్టపరిహారాలు సైతం రాకుండా నిలిచిపోయాయి. ఇక ప్రభుత్వం విడుదల చేయాల్సిన రూ.కోట్ల్ల నిధులకు భరోసా కల్పించడంలేదు. మరోవైపు కొద్దికాలంగా నిలిచిపోయిన నాన్‌ప్లాన్ గ్రాంటు బకాయిలు రూ.కోట్లకు చేరిపోయింది. ఇలా ప్రభుత్వం నుంచి వివిధ రకాలుగా రావాల్సిన రూ.కోట్లాది నిధులు ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో నగరపాలక సంస్థ ఆర్థికస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ట్రెజరీ ద్వారా ఉద్యోగులకు జీతాలు, విశ్రాంతి ఉద్యోగులకు పింఛన్లు వంటి వాటి విషయంలో అధికారుల చర్యలు ఇప్పటికీ వేగవంతం కాకపోవడంతో వారికి మరో రెండు మూడు నెలలపాటు జీతాలు అందని పరిస్థితి నెలకొంది.
గతంలో వృత్తి పన్నుల వసూళ్లను వాణిజ్య పన్నుల శాఖ చూసేది. ఆశాఖ అధికారులే వాణిజ్య, వృత్తి పన్నులను వసూలుచేసి తదుపరి నగరపాలక సంస్థకు జమ చేసేవారు. వృత్తి పన్నులను నగరపాలక సంస్థ నేరుగా వసూలు చేసుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఫలితంగా ఇక్కడి రెవెన్యూ అధికారులు వృత్తి పన్నును వసూలు చేస్తున్నా, వసూలవుతున్న రూ.కోట్ల నిధులను ప్రభుత్వపు ఖజానాలో జమ చేస్తున్నారు. ఆపై ఆ నిధులను తిరిగి వసూలు చేసుకోవడం నగరపాలక సంస్థకు తలకు మించిన భారంగా మారింది. ప్రస్తుతం రూ.20 కోట్లు నగరపాలక సంస్థకు రావాల్సి ఉంది. నగరం నుంచి వసూలయ్యే ఆస్తి పన్ను ఇటీవల వరకు నగరపాలక సంస్థ ఖజానాకు నేరుగా జమ అయ్యేది. ఇటీవల సీడీఎంఏ మాడ్యూల్స్‌లో తగిన మార్పులు, చేర్పులు కారణంగా ఇక్కడ వసూలయ్యే రూ.కోట్లాది ఆస్తి పన్ను నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరిపోతుంది. ఆపై ఆక్కడ నుంచి నగరపాలక సంస్థకు తిరిగి జమ కావడం కష్టంగా మారిపోయింది. ఫలితంగా పాతబకాయిలు, గతనెల వసూళ్లతో కలుపుకుని ప్రస్తుతం రూ.25 కోట్లు నగరపాలక సంస్థకు రావాల్సి ఉండగా, తాజాగా జమ అయిన మరిన్ని రూ.కోట్ల పన్నుల బకాయిలు కలుపుకుని మొత్తం రూ.30 కోట్లకు పైగానే
ప్రభుత్వం నుంచి క్రమం తప్పకుండా విడుదల అయ్యే నాన్‌ప్లాన్ గ్రాంటు దాదాపు ఐదు కిస్తీల కింద దాదాపు రూ.20.50 కోట్ల వరకు నగరపాలక సంస్థకు రావాల్సి ఉండగా, వాటి విడుదల కోసం అధికారులు చేసిన ప్రయత్నాలు, ఫలితాలు విఫలం కావడంతో ప్రస్తుతం వాటిపై వారు ఆశలు వదులుకున్నారు. నగర పరిధిలోని పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఆస్తి పన్నుల కింద నగరపాలక సంస్థకు రూ.52 కోట్లు రావాల్సి ఉండగా, వాటిపై వడ్డీలు వగైరా కలుపుకుని మొత్తంగా బకాయిలు మరిన్ని రూ.కోట్లకు చేరింది. అయితే వాటి వసూళ్ల కోసం అధికారులు, పాలకులు చేసిన పలు ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు వడ్డీలు గట్రా లేకుండా ఇకపై సర్వీసు ట్యాక్సు కింద మాత్రమే ఆ సంస్థల నుంచి సొమ్ములు వసూలు చేసేలా ప్రభుత్వం ఆదేశించడంతో బకాయిలేకా, ప్రస్తుతం రావాల్సి సర్వీసు టాక్సు కూడా రావడంలేదు.