తూర్పుగోదావరి:
జిల్లాలో రబీలో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. రైతుల నుంచి మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. మరోవైపు ఫొని తుపాను కారణంగా కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది.. ఇంతవరకూ బాగానే ఉన్నా.. మిల్లుల్లో మర పట్టిన ఆ బియ్యాన్ని నిల్వ చేసేందుకు స్థలం లేక అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ పద్ధతిలో సేకరించిన బియ్యాన్ని నిల్వ చేసే బాధ్యతను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. జిల్లాలో ధవళేశ్వరం, కాకినాడ, బిక్కవోలు, పేరూరు, సామర్లకోట ప్రాంతాల్లో ఎఫ్‌సీఐకి సొంత గోదాములున్నాయి. మరో 23 వరకు స్టేట్‌వేర్ కార్పొరేషన్, సెంట్రల్‌వేర్ కార్పొరేషన్, ప్రైవేట్‌వేర్ ..మిగతా 7లోకార్పొరేషన్ గోదాములున్నాయి. ఇవన్నీ 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నాయి.
ప్రస్తుతం 5.61 మెట్రిక్ టన్నుల మేర బియ్యం నిల్వలు వీటిలో ఇప్పటికే ఉన్నాయి. ఇంకా 88,123 మెట్రిక్ టన్నులకు మాత్రమే ఖాళీ ఉంది. కానీ రబీలో పండిన 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ఓ మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరకు రైతుల అవసరాల కోసం మినహాయించుకన్నా మరో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వీటి నుంచి 6.70 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయని అంచనా. కానీ గోదాముల్లో ఖాళీ మాత్రం 88,123 మెట్రిక్ టన్నులకే ఉంది. దీంతో వాటిని ఎక్కడ నిల్వ చేయాలో అని అధికారులు సతమతం అవుతున్నారు. మండపేట, ద్వారపూడి, రాజానగరం, కోరుకొండ, సీతానగరం తదితర మండలాల్లోని మిల్లుల నుంచి వచ్చిన బియ్యాన్ని ధవళేశ్వరం ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వ చేసేందుకు అనుమతులిచ్చారు. దాదాపు 50 మిల్లుల నుంచి వచ్చిన బియ్యాన్ని ఇక్కడ నిల్వ చేయాలి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన రైస్ మిల్లర్లు ఈ నెల 1వ తేదీ నుంచి ధవళేశ్వరం ఎఫ్‌సీఐ గోదాములకు లారీల్లో బియ్యాన్ని తరలిస్తున్నారు. కానీ గోదాముల్లో ఖాళీ లేకపోవడంతో ఎక్కడ భద్రపరచాలో తెలియని పరిస్థితుల్లో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దాదాపు 200 లారీలు ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ బయటే ఉన్నాయి. ధవళేశ్వరంలోని ఎఫ్‌సీఐ గోదాములు 50 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉండగా ఇప్పటికే 47వేల మెట్రిక్ టన్నులు నిల్వలుండడం గమనార్హం. ఇంకా కేవలం మూడు వేల మెట్రిక్ టన్నులకు మాత్రమే ఖాళీ ఉంది. బయట బియ్యం చూస్తే దాదాపు 30వేల మెట్రిక్ టన్నుల వరకు ఉండడం గమనార్హం.
గతంలో ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు అధికంగా ఉండేవి. కానీ మూడేళ్ల క్రితం నుంచి ఏ రాష్ట్రానికి ఉత్పత్తి అయిన ధాన్యాన్ని ఆ రాష్ట్రమే ఉపయోగించుకోవాలనే పద్ధతిని తీసుకురావడంతో ఎగుమతులు మందగించాయి. ఒకప్పుడు ఏదైనా రాష్ట్రంలో సరిగా పంటలు పండకపోతే.. అధికంగా పండిన చోట కొనుగోలు చేసి అక్కడికి తీసుకువెళ్లేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మూడేళ్ల క్రితం వరకు కేరళా, తమిళనాడు, కర్ణాటక, అండమాన్‌లకు అధికంగా బియ్యం ఎగుమతయ్యేవి. ప్రస్తుతం తక్కువగా వెళుతున్నాయి. దీంతో ఎక్కడి నిల్వలు అక్కడే ఉండిపోతున్నాయి.