యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇది ఎన్నికల అధికారుల మాట. మాకే భారీ మెజారిటీ, యాభై వేలు, డెబ్బై వేలు మెజారిటీ మాకే అన్నది ప్రధాన రాజకీయ పార్టీల మాట. అయితే కౌంటింగ్ పై శిక్షణని ఇస్తున్న ఎన్నికల అధికారులు మాత్రం తగిన జాగ్రత్తలు చెబుతూ ఈసారి ఎన్నికల సరళిని, పోలింగ్ జరిగిన తీరుని గమనించి మరీ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా జాగ్రత్తగా కౌంటింగ్ చేయాలి, వచ్చేవి స్వల్ప మెజారిటీల కాబట్టి ఒకటికి పదిమార్లు సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో త్రిముఖ పోరు జరిగింది. టీడీపీ, వైసీపీతో పాటు, జనసేన కూడా చాలా చోట్ల బలంగా ఉనికి చాటుకుందని ఎన్నికల అనంతరం సర్వేలు తెలియచేశాయి. జనసేన గెలవకపోయినా ఏదో ఒక పార్టీ విజయావశాలను దెబ్బ తీస్తుందని కూడా అంచనా వేశారు. సరిగ్గా ఇదే విషయం ఇపుడు కౌంటింగ్ అధికారులు కూడా విశ్లేషించుకుంటున్నారు.గత ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఏకంగా 38 వేల పై చిలుకు మెజారిటీ వచ్చింది. ఇక విశాఖ ఈస్ట్ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధి వెలగపూడి రామక్రిష్ణకు 48 వేల పై చిలుకు మెజారిటీ రావడమే కాదు, ఏపీలో రెండవ అతి పెద్ద మెజారిటీగా నమోదు అయింది. అదే విధంగా గత ఎన్నికల్లో ఇరవై వేలకు తగ్గకుండా టీడీపీ, వైసీపీ అభ్యర్ధులకు చాలా చోట్ల మెజారిటీలు వచ్చాయి. అపుడు అయితే టీడీపీ లేకపోతే వైసీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. దాంతో మెజారిటీలు పెరిగాయి. ఈసారి అలాంటి వాతావరణం ఉండకపోవచ్చునని ఎన్నికల అధికారులే కాదు, రాజకీయ పండితులు కూడా అంచనా వేస్తున్నారు. జనసేన పోటీ వల్ల చీలిక బాగా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.ఈసారి ఎన్నికల్లో పోస్టల్ ఓట్లు, సర్వీస్ ఓట్లు కూడా కీలకమైన పాత్ర పోషిస్తాయని అటు అధికారులు ఇటు పార్టీలు భావిస్తున్నాయి. ప్రతీ నియోజకవర్గంలో మూడు వేలకు తక్కువ లేకుండా పోస్టల్ ఓట్లు ఉన్నాయి. ఈసారి మెజారిటీలు తగ్గడం ప్రతీ ఓటు కీలకం కావడంతో ముందు నుంచి ఉద్యోగుల ఓట్ల కోసం పార్టీలు పెట్టిన ప్రలోభాలు అన్నీ ఇన్నీ కావు. ఇపుడు అదే నిజం అయ్యేలా ఉంది తక్కువ మెజారిటీలు వచ్చినపుడు గెలుపు వూగిసలాడినపుడు పోస్టల్ బ్యాలెట్ తులసీదళంలా మారి తూకం వేస్తుంది. అలా పోస్టల్ ఓటుతో గెలిచి గిన్నీస్ రికార్డ్ కి ఎక్కిన చరిత్ర విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ సీటుకు ఉంది. 1989లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్ధిపై కేవలం తొమ్మిది ఓట్ల తేడాతో కాంగ్రెస్ కి చెందిన కొణతాల రామకృష్ణ గెలిచారు. మరి ఈసారి అలాంటి చిత్రాలు ఎన్ని ఉంటాయో, తక్కువ మెజారిటీ అంటేనే ఇపుడు పార్టీలతో పాటు, అభ్యర్ధులు జడుసుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.