యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రోహిణి కార్తె ఈ నెల 25 న ప్రారంభమవుతోంది. ఈ నెల 11 నుండి 24 వరకు కృతిక కార్తె ఉంటుంది. ఆ తర్వాత రోహిణి ప్రారంభమవుతుంది. రోహిణిలో రోళ్లుపగిలే ఎండలు ఉంటాయా? భారీ వానలు కురుస్తాయా? అన్నది కాలమే చెబుతోంది. రోహిణిలో ఎండలు ప్రచండంగా ఉండే అవకాశం ఉంది. ఒక్కో సారి రుతుపవనాలతో సంబంధం లేకుండా భారీ వానలు కూడా కురుస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఎండలు మండుతాయని, వేడిగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. రోహిణి కార్తె ప్రారంభం అయిన తర్వాత ఎండల తీవ్రత మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వానాకాలంలో వానలు బాగా ఉండాలంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువగానే ఉండాలని భారతీయ సంస్కృతి చెబుతోంది. నైరుతీ రుతుపవనాలు జూన్ 12 నుండి 15 మధ్య ఉభయ తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనావేస్తున్నారు. వాస్తవంగా నైరుతీ రుతుపవనాలు రాక ముందే రుతుపవనాల ముందస్తు వానలు కూడా కురిసే అవకాశం ఉంది. రోహిణీ కార్తె మే 25 నుండి జూన్ 7 వరకు ఉంటుంది. జూన్ 8 న మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. అంటే ముందస్తు వానలు జూన్ ప్రారంభంలో కురిస్తే రైతులు విత్తనాలు వేసుకుంటారు.