యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పులిచింతల జలాశయానికి సంబంధించిన పూర్తిస్థాయి పనులు ఎప్పటికి పూర్తయ్యేనో అని డెల్టా రైతులు, రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టుకు కుడివైపు అప్రోచ్ రోడ్ నిర్మాణం, వాక్ వే బ్రిడ్జి పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఆప్రాన్ పనులు ప్రారంభం కాలేదు. మట్టుపల్లి(తెలంగాణ వైపు) వద్ద రక్షణ గోడ నిర్మాణం పూర్తయింది. అయితే ప్రాజెక్టు కుడివైపు నిర్మిస్తున్న రీటైనింగ్ వాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కుడివైపు అచ్చంపేట మండలం మాదిపాడు వరకు నిర్మించాల్సిన ప్రతిపాదిత అనుబంధ రహదారికి అంచనాలు రూపొందించే స్థాయిని దాటలేదు. ప్రాజెక్టు భద్రతకు సంబంధించి గ్రౌటింగ్ పనులు చివరి దశలో ఉన్నాయి.
ప్రాజెక్టు కుడివైపు రూ.27 కోట్లతో నిర్మించే రిటైనింగ్ వాల్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రాజెక్టుకు రక్షణ గాను, సందర్శకులను ఆకర్షించే విధంగా ఉద్యాన పార్కు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో దీనిని నిర్మిస్తున్నారు. 160 మీటర్ల పొడవుతో ప్రాజెక్టు కుడివైపు ప్రొటెక్షన్ వాల్‌ను ఆనుకొని దీనిని నిర్మిస్తున్నారు. ఈ గోడకు, ప్రాజెక్టు కట్టడానికి మధ్య ఐదెకరాల విస్తీర్ణం ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. ఈ ఖాళీ ప్రదేశాన్ని అంతటినీ మట్టితో నింపి ఆ ప్రదేశంలో పార్కు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. విజయవాడకు చెందిన శ్రీసాయిలక్ష్మీ కంపెనీ ఈ నిర్మాణం టెండర్ దక్కించుకుంది. వృద్ధి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ సబ్ కాంట్రాక్టర్ 2018 ఆగస్టులో నిర్మాణ పనులు చేపట్టింది. ఇప్పటి వరకు 70శాతం పనులు పూర్తి చేశారు. 33,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనికిగాను 24,000 క్యూబిక్ మీటర్ల పని పూర్తి చేశారు. ఒక బ్లాక్‌లో 24 మీటర్లు, మరో బ్లాక్‌లో 8 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేస్తున్నారు. ఈ గోడ ప్రాజెక్టును ఆనుకొని ఉన్న మధ్య భాగంలో ఐదెకరాల విస్తీర్ణాన్ని గ్రావెల్‌తో నింపి చదును చేయాల్సి ఉంది. చివరిలో ఈ ప్రాంతం చుట్టూ హ్యాండ్ రైలింగ్ ఏర్పాటు చేస్తారు. పనులు వేగవంతానికిగాను బ్యాచింగ్ ప్రాలంటు అక్కడే ఏర్పాటు చేశారు. రెండు హైజాక్ మిషన్లు, 8 టిప్పర్లుతో కాంక్రీట్ నిర్మాణ పని వేగంగా కొనసాగుతోంది.
ప్రాజెక్టు కుడి వైపు (గుంటూరు జిల్లా) ప్రాజెక్టు నుంచి అచ్చంపేట మండం మాదిపాడు వరకు 7 కిలోమీటర్ల రహదారికిగాను గత ఏడాది ప్రాజెక్టు నుంచి 2 కిలోమీటర్ల రహదారి మంజూరై పని జరుగుతుంది. మిగతా 5 కిలోమీటర్ల అనుబంధ రహదారి నిర్మాణం జరిగితేనే గుంటూరు జిల్లా వైపు నుంచి రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. ఈ 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కొంత భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ మార్గం నిర్మాణానికి రెండు, మూడు రూట్లలో అంచనాలను తయారు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో నిర్మించేందుకు రూ.30 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలను ఇంజినీర్లు రూపొందించే పనిలో ఉన్నారు. ఈ పనులన్నీ పూర్తయితే ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో రూపం సంతరించుకొని పర్యాటకులు, సందర్శకులను ఆకర్షించే స్థాయికి చేరుతుంది.
ప్రాజెక్టు గుంటూరు జిల్లా ప్రాజెక్టు నుంచి 2 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్ ను 2017 నుంచి 1.5 మీటర్ల ఎత్తులో నది పక్కనే రెండో వైపు కొండ పొడవునా రూ.15 కోట్ల అంచనాలతో రెండు వరుసలుగా నిర్మిస్తున్నారు. కొండ నుంచి పడే వర్షపు నీటిని నదిలోకి పంపే విధంగా ఈ రహదారి మధ్యలో మూడు చోట్ల వంతెనలు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు కొండను తొలచి రెండు వరుసల రహదారి రెండు లేయర్ల మెటల్‌తో ఏర్పాటు చేశారు. తారుతో నిర్మించే పని నిలిచిపోయింది. వాక్ వే బ్రిడ్జి ఏర్పాటుకు సంబంధించి యార్డులో ఇనుము ఫాబ్రికేషన్ పని జరుగుతోంది. ప్రాజెక్టుపై దీని ఏర్పాటుకుగాను పెద్ద క్రేను తెప్పించాల్సి ఉంది. దీంతో ఆ పని మందకొడిగా సాగుతోంది. ప్రాజెక్టు ముందు భాగంగా స్పిల్ వే పొడవునా నిర్మించాల్సిన ఆప్రాన్ పనులు ప్రారంభం కాలేదు. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ పనిపై ఆసక్తి చూపడంలేదని సమాచారం. ప్రాజెక్టు భద్రతకు సంబంధించిన ఫౌండేషన్ గ్యాలరీలో చేపట్టిన గ్రౌటింగ్, డ్రిల్లింగ్ పనులు ఇప్పటికి 90 శాతం పూర్తి చేశారు. ఫౌండేషన్ గ్యాలరీలో నీరు లీకు కాకుండా ప్రాజెక్టు భద్రతకు ఈ పని చేపట్టాలని ప్రాజెక్టు భద్రత కమిటి మూడేళ్ల కిందట సూచించింది. 309 హోల్స్‌కుగాను 308 హోల్స్ గ్రౌటింగ్ డ్రైనేజి హోల్స్ పూర్తి చేశారు. మరో 32 డ్రైనేజి హోల్స్ పని జరుగుతుంది. తెలంగాణ వైపు మట్టుపల్లి వద్ద నదికి రక్షణ గోడ నిర్మాణం 102 మీటర్ల పొడవు, 17 మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.