కర్నూలు: తుంగభద్ర నది ఒడ్డునే ఉన్న కందనవోలు నగరానికి నీటి కష్టాలు తప్పడం లేదు. తాగునీటికి శాశ్వత పరిష్కారం చూపుతామన్న ప్రజాప్రతినిధుల మాటలు ఎండమావుల్లా మారాయి. ప్రస్తుతం నగరం దాహార్తి తీర్చే సుంకేసుల, గాజులదిన్నె ప్రాజెక్టుల్లో నీరు అడుగంటింది. మరోవైపు అడుగడుగునా అనధికారికంగా బోర్లు వేయడంతో భూగర్భ జలమూ రోజురోజుకూ లోతుకు పోతోంది. నగరం, శివారులో ఉన్న బహుళ అంతస్తుల్లో నీటికి అగచాట్లు పెరిగిపోయాయి. ప్రతి రోజూ ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు పేదలూ తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. గురువారం నగరంలో ఓ కుళాయి వద్ద చోటుచేసుకున్న ఘర్షణ బాలింత ప్రాణాలు బలిగొందంటే జిల్లాలో పానీపట్టు యుద్ధాలు ఏమేరకు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్ఛు
నగరంలోని బాలాజీ నగర్, సంతోష్ నగర్, స్టాంటన్‌పురం, గణేశ్ నగర్, సరస్వతీ నగర్, సోమిశెట్టి నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, శాంతి నగర్, నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని కాలనీల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ప్రధానంగా అపార్ట్‌మెంట్లలో నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. వందల లోతుల అడుగుల్లో వేసిన బోర్లు ఎండిపోవడంతో సమస్య తీవ్రమైంది. దీంతో నిత్యావసరాలకు ఉపయోగించడానికి నీరు కరవైంది. చేసేది లేక ట్రాక్టర్ ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసి తెచ్చి సంపులో నింపి అపార్ట్‌మెంట్‌వాసుల అవసరాలు తీర్చుతున్నారు. దాదాపు ఆరు లక్షల జనాభా ఉన్న కర్నూలు కేంద్రంలో నగరపాలిక ద్వారా సరఫరా చేస్తోన్న నీరు కొంత అవసరాలు మాత్రమే తీర్చుతోంది. ప్రస్తుతం నగరానికి నీటి అవసరాలు తీర్చే సుంకేసులలో 0.15 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. అంటే నగరానికి రోజుకు 104 క్యూసెక్కులు అందించినా వారం రోజులు వచ్చే పరిస్థితి లేదు. నగరానికి నీటి అవసరాలు తీర్చే గాజులదిన్నెలో 0.612 టీఎంసీ నీరు ఉంది. ప్రస్తుతం ప్రతి రోజూ 70 క్యూసెక్కులు ఇస్తున్నా... 15 రోజుల మించి ఇవ్వలేరు. ఇలా చూస్తే ఈ వేసవి గట్టెక్కడం కష్టంగానే మారింది.
కర్నూలు నగరంలో సుమారు 343 అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వీటిలో ఉన్న 6,678 ప్లాట్లలో కుటుంబాలు ఉన్నాయి. ట్రాక్టర్ ట్యాంకర్ నీటిని రూ.400 ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రోజూ రెండు, మూడు ట్యాంకర్లతో నీరు పోయిస్తే కానీ ఒక అపార్ట్‌మెంట్ అవసరాలు తీరడం లేదు. ఇలా రోజూ సరాసరిన రూ.1200 చొప్పున నెలకు రూ.36 వేలు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చును బహుళ అంతస్తుల్లో నివసించే వారి నుంచి వసూలు చేస్తున్నారు. ఇలా చూస్తే సరాసరిన ఒక్కో కుటుంబానికి(ప్లాటుకు) రూ.వెయ్యి వరకు నెలకు నిర్వహణ ఖర్చుతోపాటు అదనంగా కట్టాల్సి వస్తోంది. నగరానికి ప్రస్తుతం ఒక వేసవి జలాశయం మాత్రమే ఉంది. గార్గేయపురం చెరువులో మరో జలాశయాన్ని నిర్మించాలని ఏన్నో ఏళ్లుగా ప్రతిపాదన ఉంది. ఇది రాజకీయ కారణాలతో అటకెక్కింది.