యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పోలింగ్ ముగిశాక టిడిపి వర్గాలు చాలావరకు డీలా పడ్డాయి. ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ? తిరిగి మన ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తుందా రాదా ? వస్తే మళ్ళీ మంత్రి మండలిలో చోటు దక్కుతుందా లేదా ? ఇలా అనేక సందేహాలు పసుపుదళంలో ఉదయించి బ్యాలెట్ బాక్స్ లు చుట్టూ తిరుగుతున్నాయి. ఎక్కడా గెలుపు ధీమా కనిపించడం లేదు. దీనికి తోడు చంద్రబాబు పోలింగ్ రోజు నుంచి ఎన్నికల కమిషన్ పైనా, ఈవిఎం లపైనా అగ్గిరాముడి అవతారంలో కనిపించడం ఆందోళనలో వున్న క్యాడర్ ను మరింత గందరగోళానికి గురిచేశాయి. దాంతో మంత్రులనుంచి సామాన్య టిడిపి కార్యకర్త వరకు నిర్వేదం, నిస్తేజం లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే సర్వేలు అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు టిడిపికి కర్ణకఠోరంగా మారాయి.ముఖాలు వేలాడేసుకుని తనను కలిసేందుకు వచ్చిన చంద్రబాబు కు మంత్రులు, ఎమ్యెల్యేలను చూసి జాలేసింది. గెలుపు పై వున్న అనుమానాలు నివృత్తికి ఆయన ధైర్యాన్ని నూరిపోశారు. నేను చేసిన హడావుడిని వైసిపి తెలివిగా క్యాష్ చేసుకుని మైండ్ గేమ్ ఆడితే మీరు ఇలా అయిపోయారా ? అంటూ వారిలో హుషారు నింపే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ముఖ్యంగా బిహారీ ప్రశాంత్ కిషోర్ విసిరిన గేమ్ లో పడిపోయారని తేల్చేశారు బాబు. మైండ్ గేమ్ లో మాష్టర్ మైండ్ గా చెప్పుకునే చంద్రన్న దళం ఇలా డీలా పడడంతో గీతోపదేశం చేయడంతో బాటు ఎన్నికల్లో ఎలా గెలుస్తామో బాబు చెప్పిన లెక్కలతో మంత్రుల బృందం జయహో చంద్రబాబు అంటూ బయటకు వచ్చినట్లు సచివాలయం టాక్. ఇదంతా హస్తినలో హల్చల్ చేసేందుకు చంద్రబాబు వెళ్లేముందు జరిగిన సీన్ కావడం విశేషం.