యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అది గుంటూరు జిల్లాలో ఎస్సీ వర్గానికి రిజర్వ్ చేసిన నియోజకవర్గం ప్రత్తిపాడు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం ఆసక్తిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు సాధించింది.
రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనూ లేని విధంగా గట్టి పోరు ఇక్కడ సాగింది. దీనికి ప్రధాన కారణం.. ఇద్దరు మాజీ మంత్రులతో ఓ మహిళా నేత పోటీ చేయడమే. దీంతో ఈ నియోజకవర్గానికి మంచి హైప్ వచ్చింది. ప్రత్తిపాడు నుంచి గత ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన మేకతోటి సుచరిత.. మరోసారి తన అదృష్టాన్ని పరిశీలించుకునేందుకు రెడీ అయ్యారు. అయితే, ఈ దఫా గట్టిపోటీనే ఎదుర్కొన్నారు.ఇక, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టిన రావెల కిశోర్‌బాబు.. మధ్యలోనే టీడీపీ నుంచి బయటకు వచ్చి.. జనసేనకు జై కొట్టారు. జిల్లాలో జనసేన నుంచి పోటీ చేస్తున్న కీలక నాయకుల్లో కిశోర్‌బాబు ఒకరు. ఇక, అధికార టీడీపీ నుంచి మాజీ మంత్రి, కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాదరావు బరిలో నిలిచారు. గతంలో రెండుసార్లు తాడికొండ నుంచి కాంగ్రెస్ తరపున గెలవడంతో పాటు మంత్రిగా కూడా పనిచేసిన డొక్కా ఇక టీడీపీలోకి జంప్ చేసి ఎమ్మెల్సీ అయ్యారు. ఈ ఎన్నికల్లో డొక్కా తాడికొండ సీటు ఆశించినా చంద్రబాబు మాత్రం ఆయనకు ప్రత్తిపాడు సీటే ఇచ్చారు. ఇక వైసీపీ నుంచి మళ్లీ మాజీ ఎమ్మెల్యే సుచరితే ఉన్నారు. దీంతో ఇద్దరు మాజీ మంత్రులతో వైసీపీ అభ్యర్థి సుచరిత తలపడినట్టయింది.ఇక, నియోజకవర్గానికి వస్తే.. ఇక్కడ ప్రత్తిపాడు, గుంటూరు రూరల్, వట్టిచెరుకూరు, కాకుమాను, పెదనందిపాడు మండలాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లోనూ ఉన్న ఓటింగ్ గుంటూరు రూరల్ లో ఉన్న ఓటింగ్ కు సమానం. రూరల్ మినహా మిగిలిన నాలుగు మండలాల్లో కమ్మ వర్గం ఓటింగ్ ఎక్కువ. దీంతో ఈ మండలాల్లో టీడీపీకే స్వల్ప ఆధిక్యం కనపడుతోంది. గత ఎన్నికల్లోనూ ఇక్కడ ఇదే జరిగింది. గుంటూరు రూరల్‌లో కాపు సామాజిక వర్గం ఓటింగ్ కీలకంగా మారింది. ఇక్కడ జనసేన నుంచి బరిలో నిలిచిన రావెల కూడా గట్టిగానే పోరాడారు. ఇక, టీడీపీ నుంచి పోటీ చేసిన డొక్కా కూడా ఎక్కడా వెనుకాడలేదు. దీంతో పోరు హోరా హోరీగా సాగింది. దీంతో ఎవరికి వారే గెలుపు గుర్రం ఎక్కేందుకు తీవ్రప్రయత్నం చేశారు.జనసేన విషయానికి వస్తే.. ఆదిలో బాగానే ఉన్నా.. పోలింగ్ తర్వాత అంచనాల ప్రకారం బాగా వెనుకబడిందనే ప్రచారం ఉంది. రావెల చివరకు కాపు వర్గం ఓటర్లు ఎక్కువుగా ఉన్న గుంటూరు రూరల్లో మాత్రమే ప్రచారం చేసి మిగిలిన నాలుగు మండలాలపై పెద్దగా దృష్టి పెట్టలేదన్న ప్రచారం జరుగుతోంది. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. గుంటూరు రూరల్‌లో మినహా మిగిలిన మండలాల్లో బాగానే ఉందని అంటున్నారు. అయితే,
గుంటూరు రూరల్‌లో పరిస్థితి బాగోలేక పోవడంతోనే గతంలో ఓటమి పాలైంది. ఇక వైసీపీ అంచనాలు మరోలా ఉన్నాయి. రూరల్ మినహా మిగిలిన నాలుగు మండలాల్లో టీడీపీ ఆధిక్యం చాలా వరకు తగ్గించామని… ఆ నాలుగు మండలాల్లో రెండు చోట్ల తమకే స్వల్ప ఆధిక్యం ఉంటుందని… రూరల్ మండలంలో జనసేన ఎఫెక్ట్‌తో టీడీపీ ఓటు బ్యాంక్‌కు భారీగా గండి పడిందని..ఈ మండలంలో తాము ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే… టీడీపీ మూడో ప్లేస్‌కు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అంచనాలు ఏమేరకు సక్సెస్ అవుతాయి? ఇద్దరు మాజీ మంత్రులతో తలపడిన మేకతోటి గెలుస్తారా? అనే చర్చ సంచలనంగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.