జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ దాదాపు నెల రోజుల తర్వాత బయటకు వచ్చారు. ఆయన ఎన్నికల తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలపై పవన్ పెద్దగా టెన్షన్ పడటం లేదు. ఆయన పార్టీ అభ్యర్థులతో సమీక్ష చేసినప్పుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గెలుపోటములను పక్కన పెట్టి పార్టీ పటిష్టతకు, ప్రజా సమస్యలపై పోరాడాలని ఆయన సూచించడాన్ని దీర్ఘకాలిక ప్లాన్ లో పవన్ ఉన్నట్లు స్పష్టం అవుతుంది.అసలు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేసినా అది నామమాత్రమే. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే పార్టీ స్థాపించి ఐదేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పార్టీ బలపడలేదు. అలాంటి ప్రయత్నం పవన్ చేయలేదు. మొన్నటి వరకూ సినిమాలపైనే దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ తర్వాత రాజకీయాల గురించి ఆలోచించారు. ఎన్నికలు ముంచుకొస్తున్నా పార్టీకి జిల్లా కమిటీలను కూడా పవన్ ఏర్పాటు చేయలేదు.పవన్ ఈ ఎన్నికల్లో తాను నామమాత్రంగా ఉంటానని తెలుసు. కర్ణాటకలో లాగా హంగ్ ప్రభుత్వం ఏర్పడితే తాను కింగ్ మేకర్ అవుతానని ఒక దశలో అనుకున్నప్పటికీ, ఏపీలో ఆ పరిస్థితి లేదని అర్థమయింది. ఎవరు విజయం సాధించినా క్లియర్ కట్ మెజారిటీ రావడం ఖాయమన్న అంచనాలు ఇప్పటికే వచ్చాయి. అయితే పవన్ కల్యాణ్ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ ఏదీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.అందుకు కారణాలు కూడా ఉన్నాయి. వచ్చే ఐదేళ్లు పార్టీని రాష్ట్ర స్థాయిలో పటిష్ట పర్చాలి. ప్రతిపక్షంలో కూర్చున్నా ప్రజాసమస్యలపై పోరాడుతూ పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంకును సంపాదించుకోవాలి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి తన చేతుల్లోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే పవన్ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేదని జనసేనకు చెందిన ఒక ముఖ్యనేత అన్నారు. పవన్ ఖచ్చితంగా ఎప్పటికైనా ఏపీకి ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి క్యాడర్ ను సమాయత్తం చేసే పనిలో పవన్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయన్నది ముఖ్యం కాదన్నది పవన్ అభిప్రాయం.