YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లోకసభ స్పీకర్ పై చర్చలు

 లోకసభ స్పీకర్ పై చర్చలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

లోక్‌సభలో అత్యున్నత పదవి సభాపతి స్థానం. స్పీకర్‌ చట్టసభకు అత్యున్నత అధికారి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ కోరిక మేరకు సీనియర్‌ సభ్యులను స్పీకర్‌ పదవికి ఎంపిక చేస్తారు. గత 16 లోక్‌సభల్లో ఒక్కరు మినహా మిగిలినవారెవ్వరినీ రెండోసారి స్పీకర్‌ పదవి వరించలేదు. ఇంతకీ ఎవరు వారు? ఏమిటా కథ.? గత 16 లోక్‌సభల్లో ఒకసారి స్పీకర్‌గా పనిచేసిన వారిలో కేవలం 10 మంది మాత్రమే తిరిగి లోక్‌సభకి ఎన్నికయ్యారు. మొత్తం 16 లోక్‌సభల్లో నీలం సంజీవరెడ్డిని మాత్రమే రెండుసార్లు స్పీకర్‌ పదవి వరించింది. ఒకసారి స్పీకర్‌గా పనిచేసినవారిలో తిరిగిపోటీ చేసిన కొందరు ఎన్నికల్లో ఓడిపోవడం, కొందరు అసలు పోటీయే చేయకపోవడం, మరికొందరికి పార్టీ తిరిగి సీటు ఇవ్వకపోవడం దీనికి కారణం. 2014లో పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా స్పీకర్‌ పదవికి ఎంపికైన ప్రస్తుత స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌‌కి ఈసారి సీటు కేటాయించలేదు. ఇండోర్‌ నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో తాను అసలు పోటీయే చేయనని సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. 67 ఏళ్ళ లోక్‌సభ చరిత్రలో సుమిత్రా మహాజన్‌ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ద్వితీయ మహిళ. సుమిత్రా మహాజన్‌కన్నా ముందున్న స్పీకర్‌ మీరా కుమార్‌ తొలి మహిళా స్పీకరే కాకుండా తొలి దళిత మహిళా స్పీకర్‌గా కూడా రికార్డుకెక్కారు. మీరా కుమార్‌ కన్నా ముందు తొలి కమ్యూనిస్టు దిగ్గజం అయిన సోమనాథ్‌ ఛటర్జీ సీపీఎం నుంచి లోక్‌సభ స్పీకర్‌ పదవిని అలంకరించారు. ఛటర్జీ కష్టాలు కూడా అదే లోక్‌సభలో ప్రారంభమయ్యాయి. మన్మోహన్‌ ప్రధానిగా ఉండగా వామపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని నిర్ణయించినప్పుడు స్పీకర్‌గా రాజీనామా చేసి, లోక్‌సభ సభ్యుడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆదేశించింది పార్టీ. అయితే సోమనాథ్‌ ఛటర్జీ మార్క్సిస్టు పార్టీ నిర్ణయాన్ని తోసిపుచ్చి స్పీకర్‌ పదవి హుందాతనాన్ని కాపాడారు. అంతేకాకుండా తాను ఆపై ఎన్నికల్లో పోటీ చేయనని కూడా తేల్చిచెప్పేశారు. శివసేన వ్యవస్థాపకుల్లో ఒకరు, శివసేన అధినాయకుడు బాల్‌‌థాకరే అతి సన్నిహితుడూ అయిన మనోహర్‌ జోషీ
సోమనాథ్‌ ఛటర్జీకన్నా ముందు లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. స్పీకర్‌ పదవిని చేపట్టడాని కన్నా ముందు మనోహర్‌ జోషీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మనోహర్‌జోషీ గెలిచారు. అయితే జీఎంసీ బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో హఠాత్తుగా మరణించడంతో మనోహర్‌ జోషీని స్పీకర్‌ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జోషీ అసెంబ్లీలో సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తే కాకుండా శివసేన సీనియర్‌ నాయకుడు కూడా కావడంతో ఆయనను స్పీకర్‌ పదవి వరించింది. ఆ తరువాత 2004 ఎన్నికల్లో జోషీ ఓడిపోవడంతో ఆయన తిరిగి లోక్‌సభలో అడుగుపెట్టలేదు. చట్టసభల తొలి స్పీకర్‌ జీఎస్‌. మాల్వంకర్‌ 1952లో ఎన్నికయ్యారు. 1956లో ఆయన మరణించారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 ఎన్నికల తరువాత తొలి లోక్‌సభకు కేఎస్‌.హెగ్డే స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈయన కూడా తిరిగి రెండోసారి లోక్‌సభకు ఎన్నిక కాలేదు.

Related Posts