యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అద్బుత ఘట్టం ఇక్కడ ఆవిష్కృతం కాబోతుంది. రంజాన్ సందర్భంగా రామజన్మభూమి సమీపంలోని ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన సరయు కుంజ్ ఆలయంలో ముస్లిం సోదరులకు సోమవారం విందు ఇవ్వనున్నారు. అయితే, ఈ విందుకు ఏ పార్టీలకు చెందిన నేతలను కూడా ఆహ్వానించలేదని ఆలయ ప్రధాన పూజారి మహంత్ జుగల్ కిశోర్ శరన్ శాస్త్రి వ్యాఖ్యానించారు. అయోధ్యలో శాంతి, సామరస్యాలను ప్రోత్సహించడమే తమ అభిమతని, ఈ కార్యక్రమంతో రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పవిత్ర రంజాన్ నెలలో ఆయోధ్యలోని హిందూ పండితులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుకు ఆహ్వానించే సంప్రదాయం ఉందని తెలిపారు. ఇందులో భాగంగా వారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. అయోధ్యలోని ప్రముఖ హనుమాన్‌గర్హి ఆలయంలోనూ ముస్లింలకు ఇఫ్తార్‌ను ఇచ్చిన విషయం గుర్తుచేశారు. ప్రాచీన శివాలయాల్లో ఒకటైన లక్నోలోని మన్‌కామేశ్వర్ ఆలయానికి చెందిన సన్యాసిని, ప్రధాన పూజారి మహంత్ దివ్య గిరి గతేడాది ఇఫ్తార్ విందు ఏర్పాటుచేయగా, పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. హిందూమతానికి చెందిన ఒక సన్యాసిని ఇఫ్తార్ విందు ఇవ్వడం ఇదే తొలిసారి.