YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అక్కరకు రాని బీమా

అక్కరకు రాని  బీమా

అన్నదాతలకు బీమా అక్కరకు రావడం  లేదు. బీమా కొంతలో కొంతైనా ఆదుకుంటుందని భావించిన రైతన్నలకు నిరాశ ఎదరువుతోంది. చెల్లింపుల్లో మెలికలు పెట్టడం.. అందరికీ రాకపోవడంతో ఇప్పటికీ రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే 2.47లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా ఆయా ప్రాంతాల్లోనే వేలాది ఎకరాలు నేలవాలడంతో పంట పాడైపోయింది. తుఫాన్ దెబ్బకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలూ దెబ్బతిన్నాయి. బందరు, అవనిగడ్డ డివిజన్‌ ప్రాంతాల్లోని ఎక్కువ శాతం ప్రాంతాల్లో నష్టవాటిల్లింది. ఈ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. దెబ్బతిన్న పంటకు బీమా అందుతుందన్న ఆశతో ఉన్నారు. ఇంకా సాయం అందకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. బీమా సంస్థ తీసుకున్న అస్తవ్యస్త చర్యల కారణంగా ఒకరికి వస్తే ఒకరికి రాలేదు. అసలు వస్తుందో లేదో తెలియక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
 బందరు, గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, చల్లపల్లి, ముదినేపల్లి, మొవ్వ, పామర్రు ఇలా ఆయా ప్రాంతాల్లోని వేలాదిమంది బీమా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలు, ఇతర వాణిజ్య బ్యాంకులు రైతులకు పంట రుణాలు ఇచ్చే సమయంలోనే బీమా ప్రీమియం మినహాయిస్తారు. ఎక్కువశాతం మంది సహకార సంఘాల నుంచే రుణాలు తీసుకున్నారు. ప్రీమియం చెల్లిస్తారు. ఇలా ప్రీమియం చెల్లించిన వారిలో పంట నష్టపోయిన వారందరికీ బీమా అందించాలి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి బీమా సాయం కొందరికే వచ్చింది. గూడూరు మండలంలో మల్లవోలు పీఏసీఎస్‌లో 490 మంది ప్రీమియం చెల్లించగా 240 మందికి బీమా వచ్చింది. ఈ మండలంలో రాయవరం, జక్కంచర్ల సంఘాల్లో ఒకరిద్దరికి మాత్రమే వచ్చింది. బందరు, అవనిగడ్డ, మిగిలిన డివిజన్‌ల పరిధిలోని సహకార సంఘాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైతులు సంఘాల అధ్యక్షులపై ఒత్తిడి తీసుకురావడంతో వారంతా ఇటీవల గుంటూరులోని బీమాసంస్థ కార్యాలయానికి వెళ్లి మొర పెట్టుకున్నారు. కేడీసీసీ బ్యాంకు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాల్లో ప్రీమియం చెల్లించినవారిలో ఎంతమందికి వచ్చింది, ఇంకెంతమందికి సాయం రావాల్సిఉందో నివేదిక తయారు చేసి బీమా సంస్థకు అందించారు. ఇది జరిగి చాన్నాళ్లు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడక పోవడంతో మరింత ఆందోళన చెందుతున్నారు.
ఫసల్‌బీమా యోజన పథక నిబంధనల ప్రకారం గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రీమియం చెల్లించిన రైతులు అందరికీ బీమా వర్తింప చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బీమా సంస్థ ప్రతినిధులు అలా తీసుకోవడం లేదు. తుపాను సమయంలో పంట వివిధ దశల్లో ఉంది. బీమా సంస్థ అధికారులు నష్టపోయిన పంటతో రైతు ఫొటో తీసుకొని దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గడువు కూడా రెండు మూడు రోజులే ఉండటంతో ఎవరికి వారు హడావుడిగా ఫొటోలు తీసి పంపించారు. చాలామందికి ఆ విషయం తెలియక పంపించలేక పోయారు. గ్రామాల్లో ఉన్న సహకార సంఘాల ద్వారా చాలా మంది దరఖాస్తులు అందజేస్తే కొందరు మచిలీపట్నం ఏడీ కార్యాలయంలో మరికొందరు నేరుగా గుంటూరు వెళ్లి ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో ప్రీమియం చెల్లించనవి, చిత్రాలు సరిగా లేనివి ఇలా వివిధ అంశాలను ప్రామాణికంగా చేసుకొని అనర్హమైనవాటిని తొలగించగా 15 వేల దరఖాస్తులు మాత్రమే అర్హమైనవిగా గుర్తించారు. వారిలో 12 వేల మందికి రెండు విడతలుగా రూ. 19 కోట్లు అందజేశారు. అధికారులు చెప్పిన గణాంకాలను ప్రామాణికంగా తీసుకున్నా ఇంకా 3 వేల మందికి బీమా అందాల్సి ఉంది. వారంత తమ పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts