ఖమ్మం: మట్టి వ్యాపారులు దందా సాగిస్తున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా మట్టి తోలకాలు చేపడుతున్నారు. అడ్డువచ్చిన వారిపై దాడులు చేయడం, అవసరమైతే వాహనాలతో ఢీకొట్టడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. మట్టితోలకాల కోసం ట్రాక్టర్ డ్రైవర్‌లుగా కూలి పనులకు వెళ్లిన వారు చీకట్లో వాహనాలు నడపలేక ఇబ్బందులు పడుతూ వాహనాలు బోల్తాపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ స్థలాలు, గుట్టల ప్రాంతాలు ఎక్కడ ఉన్నా వాటిని మట్టి వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. మట్టి వ్యాపారులు ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా తోలకాలు సాగిస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగానే గండిపడుతోంది.
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం గ్రామీణం, ఖమ్మం అర్బన్, కొణిజర్ల, ముదిగొండ, రఘునాథపాలెం, చింతకాని, సత్తుపల్లి మండలాల్లో స్థిరాస్తి వ్యాపారం, ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారంలో ఇంటి నిర్మాణాలు చేసేవి కొన్ని, మరికొన్ని చోట్ల రహదారులు నిర్మించి, రోడ్లు వేసి శ్రీగంధం, మల్బరీ వేప మొక్కలు వేస్తున్నారు. ఇలా రెండు రకాలుగా స్థిరాస్తి వ్యాపారం జరుగుతుంది. వీటితోపాటుగా గ్రామాల్లో బీటీ రహదారులు, సిమెంట్ రహదారుల నిర్మాణాలు చేపట్టిన తరువాత వాటి అంచులను మట్టితో నింపాల్సి ఉంటుంది. వీటికి అక్రమ మట్టితోలకాలు జరుగుతున్నాయి. ఖమ్మం గ్రామీణ మండలంలోని వెంకటగిరి, గుర్రాలపాడు, ఏదులాపురం, తెల్దారుపల్లి, మద్దులపల్లి, ముత్తగూడెం, ఆరెంపుల, గోళ్లపాడు, ఎంవీపాలెం, ఆరెకోడు, చింతపల్లి, పోలేపల్లి, ఆటోనగర్ ప్రాంతాలు, ఖమ్మం అర్బన్‌లో కైకొండాయిగూడెం, రామన్నపేట, దానవాయిగూడెం, ఖానాపురంహవేలీ, అల్లీపురం, రఘునాథపాలెం మండలంలో బల్లేపల్లి, వెలుగుమట్ల ప్రాంతాలతో ఎక్కువగా మట్టితోలకాలు జరుగుతున్నాయి.
వ్యాపారులు అక్రమంగా అనుమతులు లేకుండా మట్టి తోలకాలు చేపడుతూ వారికి అడ్డు వచ్చిన అధికారులు, స్థానిక ప్రజలపై దాడులు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. కొన్ని నెలల క్రితం వెంకటగిరిలో మట్టితోలకాలు చేపడుతున్నారని స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు మట్టి తోలకాలను ఆపి, మట్టితోలే ట్రాక్టర్లను సీజ్ చేయడానికి వెళ్లారు. మట్టి వ్యాపారులు తన అనుచరులతో కలిసి రెవెన్యూ అధికారులపైనే దాడులు చేసి, ట్రాక్టర్‌లతో ఢీకొట్టే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అధికారులు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పొట్టకూటి కోసం ట్రాక్టర్ డ్రైవర్‌గా కూలీ పనులకు వెళ్లిన వారు అక్రమ మట్టి తోలకాల వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. పగలు అయితే ఫర్వాలేదు. కానీ, రాత్రిపూట మట్టి తోలకాలు చేపట్టడం వల్ల ట్రాక్టర్ డ్రైవర్లకు రహదారి సక్రమంగా కన్పించక వాహనాలు బోల్తాపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మండల పరిధిలోని ముత్తగూడెంలో పొట్టకూటి కోసం ట్రాక్టర్ డ్రైవర్‌గా కూలి పనులకు వెళ్లిన గద్దల నాగులు బుధవారం అర్ధరాత్రి మట్టి ట్రాక్టర్ బోల్తాపడి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. సదరు మట్టి వ్యాపారి విషయాన్ని పెద్దది కాకుండా చేసేందుకు కొంత నగదు అప్పజెప్పి డ్రైవర్ ప్రాణానికి ఖరీదు కట్టి చేతులు దులుపేసుకున్నారు.