YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆదివాసీలుగా మారిన పోలవరం బాధితులు

ఆదివాసీలుగా మారిన పోలవరం బాధితులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో ముందుగానే ఆదివాసీలు బాధితులుగా మారిపోయారు. తూర్పు గోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని దేవీపట్నం మండలంలో 43 గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా 2004లో ప్రభుత్వం గుర్తించింది. పోలవరం ప్రాజెక్టు పనుల నేపధ్యంలో గతంలో దేవీపట్నం, మంటూరు వరకు తిరిగే ఆర్టీసీ బస్సులను 2004 నుంచి రద్దు చేశారు. విద్యార్థులు, స్థానికులు పడవలపైనే ప్రయాణం చేసి ఏ చిన్న అవసరానికైనా బయటకు రావాల్సి ఉంది. గోకవరం, రాజమహేంద్రవరం, అమలాపురం, రావులపాలెం డిపోల నుంచి రంపచోడవరం, దేవీపట్నం మీదుగా మంటూరుకు బస్సులు తిరిగేవి. ఇపుడు రంపచోడవరం నుంచి దేవీపట్నం వరకు విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సును తిప్పుతున్నారు. దేవీపట్నం నుంచి అగ్రహారం, మూలపాడు, మడిపల్లి, మంటూరు, కచ్చులూరు, కె గొందూరు, తున్నూరు, తెలిపేరు, కొండమొదలు గ్రామాలకు లాంచీలే శరణ్యం. కనీస సదుపాయాలు లేక ఈ గ్రామాలు అధ్వాన్నంగా మారాయి. ఈ గ్రామాల ప్రజలకు రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయానికి రావాలంటే దేవీపట్నం వరకు లాంచీపై వచ్చి అక్కడ నుంచి ఆటో, లేదా వ్యాన్ ఎక్కి రంపచోడవరం చేరుకోవాల్సిందే. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల లాంచీ ప్రమాదం జరిగిన ప్రాంతం మంటూరుకు చేరుకునేందుకు అధికార యంత్రాంగానికి గంటల తరబడి సమయం పట్టింది. ప్రమాదం జరిగిందని తెలుసుకునేందుకే ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే, సమాచారం తెలిసిన తర్వాత ఆయా ప్రాంతానికి చేరుకోవాలంటే ఉదయం బయలుదేరితే మధ్యాహ్నానికి చేరుకునే పరిస్థితి నెలకొంది. గిరిజనుల బాగోగులు పట్టించుకునేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏటికేడాది బడ్జెట్‌లో రూ. కోట్ల నిధులు వెచ్చిస్తుంటారు. దాదాపు అర్ధ శతాబ్ధానికి పైగా ఈ నిధులు ఖర్చు చేస్తున్నా నేటికీ కొండపై జీవిస్తున్న గిరిజనులకు రహదారి సదుపాయం లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మ్యూలం చెల్లించుకోవాల్సిందే. ఆ వార్త బయట ప్రాంతానికి తెలియడానికే రెండు మూడు రోజులు పడుతోంది. ఇక సహాయక చర్యలు చేపట్టాలంటే అధికార యంత్రాంగానికి ఎంత సమయం పడుతుందో అర్ధమవుతూనే వుంది.దేవీపట్నం మండలం మంటూరు నుంచి కొండమొదలు వరకు గోదావరి ఒడ్డున 30 కిలో మీటర్ల రహదారి నిర్మించేందుకు 1995లో ఐటీడీఏ చర్యలు చేపట్టింది. 2004లోనే ఇక్కడి రోడ్డు నిర్మాణాన్ని పోలవరం భూసేకరణ పనుల వల్ల నిలుపుదల చేశారు.ప్రాజెక్టు పేరుతో దాదాపు దశాబ్ధంన్నరగా అభివృద్ధి పనులు నిలిపి వేశారు. ఎలాగూ ముంపు ప్రాంతమే కదా అంటూ కనీసం రోడ్లు కూడా వేయడం మానేశారు. అప్పటి వరకు చేస్తున్న అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిపి వేశారు. దేవీపట్నం మండలం అంతా నిర్వాసిత ప్రాంతంగానే ఉంది. ఈ మండలంలోని మొత్తం గ్రామాలకు బస్సు సదుపాయం రద్దయింది. దీంతో కొండమొదలు పంచాయతీలోని 17 గ్రామాలు, తున్నూరు పంచాయతీలోని 13 గ్రామాల గిరిజనులు లాంచీలు, నాటు పడవల ప్రయాణంపై ఆధారపడ్డారు.కచ్చులూరు, కె గొందూరు, తున్నూరు, తెలిపేరు, కొండమొదలు, కొక్కెరగూడెం, పెదగూడెం, కొత్తగూడెం, మెట్ట గూడెం, తాటివాడ, సోమర్లపాడు, నడిపూడి గ్రామాలకు రహదారి నిర్మించకుండా వదిలేశారు.  వాడపల్లి వద్ద జరిగిన లాంచీ ప్రమాదం గిరిజనుల స్థితిగతులను మరొక్క సారి బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. పోలవరం నిర్వాసితులను ముందు సురక్షిత ప్రాంతంలో తలదాచుకునే విధంగా చర్యలు తీసుకుని ఆపై పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టాల్సి ఉంది. కొండమొదలు పంచాయతీలోని గ్రామాలకు నేటికీ జల రవాణాయే దిక్కంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ముందుగా ఆదివాసీ ప్రాంతాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తే ఏదైనా ప్రమాదం జరిగినపుడు వారిని సురక్షిత ప్రాంతానికి సునాయాసంగా తరలించేందుకు అవకాశం వుంటుంది.

Related Posts