యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కౌంటింగ్ వేడి ప్రారంభమయ్యింది. కౌంటింగ్ కోసం రాజకీయ పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలోని లాడ్జీలను ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. ఈ నెల 23న కౌంటింగ్ కావడంతో 22వ తేదీనే తమ అనుచరులతో కలిసి కర్నూలు నగరానికి చేరుకోనున్నారు. కౌంటింగ్ ఏజెంట్లతో పాటు సాంకేతిక నిపుణులు, న్యాయ నిపుణులను కూడా అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు. వీరందరూ ముందు రోజే అంటే 22వ తేదీనే కర్నూలుకు చేరుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్‌కు వ్యవధి ఎక్కువగా ఉండటంతో ఈ టెన్షన్ తట్టుకోలేని పలువురు నేతలు విహారయాత్రలకు వెళ్లిపోయారు. కొద్ది మంది మాత్రం ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు ఫలితాలు బేరీజు వేసుకుంటున్నారు. మరికొందరు ఎన్నికలు ముగిసిన వెంటనే ఒకట్రెండు రోజులు దగ్గరున్న నేతలతో సమీక్షించుకుని. అనంతరం టూర్లకు వెళ్లిపోయారు. ఇక్కడే ఉంటే ఈ టెన్షన్‌ను భరించలేం బాబోయ్ అంటూ కుటుంబ సమేతంగా కొందరు టూర్లకు వెళ్లారు. మరికొందరు మిత్రులతో కలిసి వెళ్లారు. కాగా.. మరో వారం రోజుల్లో కౌంటింగ్ ఉండడంతో తిరిగి నియోజకవర్గాలకు పయనమవుతున్నారు. ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్లను ఎంపిక చేసుకోవడంతో పాటు వారికి శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. అంతేకాకుండా కౌంటింగ్ రోజున హడావుడి చేసేందుకు వీలుగా జిల్లా కేంద్రానికి రావాలంటూ తమ వర్గీయులకు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా కర్నూలు నగరంలోని లాడ్జీలన్నీ ఇప్పటికే బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ తమ నేతలు గెలిస్తే ఫూటుగా మందు పార్టీ చేసుకునేందుకూ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం 23వ తేదీ రాత్రి వరకు లాడ్జీల్లోనే బసచేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ ఓటమి పాలైనా ఆ బాధతో ఆ రోజు లాడ్జీల్లోనే మందు సేవించే అవకాశముంది. దీన్నిబట్టి ఫలితం ఎలా ఉన్నా.. రెండు రోజుల పాటు లాడ్జీల్లో తిష్ట వేయడం మాత్రం కచ్చితమని వివిధ పార్టీల నేతలు అంటున్నారు. లాడ్జీల్లో రూంలను బుక్ చేసుకోవడంతో పాటు ముందుగానే మద్యాన్ని కూడా సమకూర్చుకుంటున్నారు. కౌంటింగ్ రోజున మద్యం దుకాణదారులు బ్లాక్‌లో విక్రయించే వీలుంది. దీనివల్ల అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందనే ముందుచూపుతో రెండు రోజులకు అవసరమయ్యే మద్యాన్ని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. వీవీ ప్యాట్ల లెక్కింపు తర్వాతే తుది ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్న నేపథ్యంలో టెన్షన్ మరింత పెరిగిపోనుంది. ఈ ఉత్కంఠ నుంచి బయటపడేందుకు వీలుగా ‘తగిన’ ఏర్పాట్లలో రాజకీయ పార్టీల నేతలు, అనుచరులు నిమగ్నమవుతున్నారు. మొత్తంగా జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ వేడి.. వేసవి వడగాలులతో సమానంగా మొదలయ్యిందని చెప్పవచ్చు.