YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అఖిలేష్, ములాయంలకు ఊరట.. క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ

 అఖిలేష్, ములాయంలకు ఊరట.. క్లీన్ చిట్ ఇచ్చిన సీబీఐ

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ లకు ఊరట లభించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ... తండ్రీకొడుకులిద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇద్దరికీ వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని... ఈ నేపథ్యంలో 2013 ఆగస్టులో కేసును మూసివేసినట్టు ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రాథమిక విచారణ సందర్భంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని... అందువల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అఫిడవిట్ లో తెలిపింది. కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు కూడా ఎన్నడూ ఆదేశించలేదని తెలిపింది. 2013 ఆగస్టు తర్వాత కేసుకు సంబంధించి ఎలాంటి విచారణ జరపలేదని వెల్లడించింది.ములాయం కుటుంబం అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆదాయానికి మించి ఆస్తులను సమకూర్చుకుందని గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్ చతుర్వేదీ 2005లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2007 మార్చి 1న ములాయం, ఆయన కుమారులు అఖిలేశ్ యాదవ్‌, ప్రతీక్‌ యాదవ్‌, కోడలు డింపుల్‌ యాదవ్‌లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత కేసు నుంచి డింపుల్‌ యాదవ్‌కు మినహాయింపు కల్పించింది.అయితే ఇంతవరకు ఈ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవడంతో విశ్వనాథ్‌ ఇటీవల మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీబీఐపై ప్రశ్నల వర్షం కురిపించింది. ములాయం, అఖిలేశ్‌పై కేసు ఏమైంది.. అసలు కేసు నమోదు చేశారా లేదా.. అని గట్టిగానే ప్రశ్నించింది. దర్యాప్తుపై తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో నేడు సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Related Posts