యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
100శాతం వీవీప్యాట్లు లెక్కించాలన్న డిమాండ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వందశాతం వీవీప్యాట్లను లెక్కించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం
సుప్రీంకోర్టు తిరస్కరించింది. టెక్నోపర్ ఆప్ అనే సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని వెకేషణ్ బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, ఇది న్యూసెన్స్ పిటిషన్ అని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఎన్డీయేతర 21 విపక్ష పార్టీల నాయకులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు సందర్భంగా వీవీప్యాట్లనే మొదట లెక్కించి తర్వాత ఈవీఎంలను లెక్కించాలని.. ఈవీఎం, వీవీప్యాట్లలో నమోదైన ఓట్ల మధ్య తేడాలుంటే నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీని కోరనున్నట్లు తెలుస్తోంది.కాగా వీవీప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టులో ప్రతిపక్ష పార్టీలకు ఇదివరకే ఎదురుదెబ్బ తగిలిన విషయంతెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల) ఫలితాలతో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ స్లిప్(వీవీప్యాట్)లను సరిపోల్చాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఇదివరకే తోసిపుచ్చింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏవేని 5 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చాలంటూ ఏప్రిల్ 8వ తేదీన తాము వెలువరించిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని ఇదివరకే సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.