విజయవాడ: నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఒకవైపు ఎండ వేడి.. మరో వైపు వాహనాల నుంచి వెలువడే వెచ్చని.. పొగ కాలుష్యం వల్ల.. రహదారులపై ద్విచక్రవాహనదారులు, పాదచారుల పరిస్థితి దారుణంగా మారింది. ప్రధానంగా నగరంలో తిరిగే ఆర్టీసీ బస్సుల నుంచి వెలువడే నల్లని పొగ దెబ్బకు.. కాలుష్యం రెట్టింపు అవుతోంది. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న ఆర్టీసీ సిటీ బస్సుల్లో కనీసం సగం బస్సులు మార్చాల్సినవే ఉన్నాయి. వీటిలో కనీసం ఓ వందకు పైగా బస్సులు.. కాలం చెల్లి, తిరగాల్సిన దాని కంటే అధికంగా తిరిగేసినవే. ఇంక తిరగడం తమ వల్ల కాదన్నట్టుగా.. బస్టాపుల్లో ఆగి కదిలిన ప్రతిసారీ.. పెద్దగా శబ్దం చేస్తూ.. నల్లని, చిక్కని పొగను రోడ్డుపై వెళ్లే ఇతర వాహనాలపైకి వదులుతున్నాయి. వీటి దెబ్బకు.. ఈ బస్సులకు ముందు, వెనుక వెళ్లాలంటేనే.. తోటి వాహనదారులు, ద్విచక్రవాహనదారులకు గుండెల్లో ఆందోళన పెరిగిపోతోంది. నగరంలో సగం శ్వాసకోస సంబంధ వ్యాధులు పెరగానికి.. ఈ ఆర్టీసీ బస్సులే కారణంగా మారుతున్నాయి. ఒక్కసారి ఈ బస్సులు వెదజల్లే పొగను పీలిస్తే.. ఖచ్చితంగా ఆసుపత్రుల పాలవ్వాల్సిందే.
విజయవాడ నగరంలో 450కు పైగా సిటీ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నగరంలోని అన్ని ప్రాంతాలతో పాటూ.. శివారుల్లోని కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, ఇబ్రహీంపట్నం వరకూ ఈ సిటీ బస్సులు వెళ్లి వస్తుంటాయి. వీటిలో కనీసం 40శాతం బస్సులు కాలం చెల్లినవే ఉన్నాయి. ఈ బస్సులను గతంలో ఎనిమిది లక్షల కిలోమీటర్ల వరకూ తిప్పేవారు. తర్వాత.. రహదారులు గతం కంటే బాగున్నాయనే కారణంతో.. మరో రెండు లక్షల కిలోమీటర్లు పెంచారు. 10లక్షల కిలోమీటర్ల వరకూ తిప్పొచ్చన్నారు. కానీ.. దానిని అలా పెంచుకుంటూ.. 12.. 14.. 15 లక్షలు దాటిపోయినా సరే ఇంకా తిప్పుతూనే ఉన్నారు. దీంతో వాటి నుంచి వెలువడే కాలుష్యం దెబ్బకు నగరవాసులకు శ్వాసకోస వ్యాధులు పెరిగిపోతున్నాయి. ఈ పాత బస్సులను మార్చాల్సి ఉన్నా.. ఆర్థిక ఇబ్బందుల పేరుతో ఆర్టీసీ అధికారులు మార్చడం లేదు. 1993, 97ల్లో వచ్చిన బస్సులు సైతం కొన్ని ఇంకా తిరుగుతుండడం గమనార్హం. దీంతో ఈ బస్సుల ముందు, వెనుక వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. ముందు వెళ్లాలంటే.. ప్రాణాలకు గ్యారంటీ లేదు. బ్రేకులు సరిగా పడతాయో లేదో తెలియదు. అసలే.. సింగ్‌నగర్ లాంటి ప్రమాదాలు అనేకం చూశారు. వెనుక వెళ్తే.. నల్లని పొగ కమ్మేస్తోంది. విజయవాడ నగరంలో గతంలో స్టీరింగ్‌లు ఊడిపోయినవి, టైర్లు అరిగిపోయి నడుస్తుండగా పేలిపోయినవి, ప్రయాణికులు ఎక్కే ఫుట్‌రెస్ట్‌లు జారిపోయిన సంఘటనలు చాలా జరిగాయి. అయినా.. వీటిని మార్చేందుకు చర్యలు చేపట్టడం లేదు.
అమరావతి రాజధానిలో కీలకమైన విజయవాడలో ఈ పాత డొక్కు బస్సులు నిత్యం తిరుగుతూ.. నగర స్థాయిని దిగజారుస్తున్నాయి. దేశవిదేశాల నగరానికి నిత్యం వచ్చే సందర్శకులు, ప్రముఖులు ప్రయాణించే వాహనాల పక్కనుంచే నల్లని పొగ వెదజల్లుతూ ఈ ఆర్టీసీ సర్వీసులు తిరుగుతున్నాయి. నగరంలోని ఏ బస్టాప్‌లోనైనా, ఏ ప్రధాన రహదారిపైనైనా ఓ గంట నిలబడి చూస్తే.. వచ్చే బస్సుల్లో కనీసం సగం పొగను వెదజల్లుతూ వెళ్లేవే ఉంటున్నాయి. వీటికితోడు కాలం చెల్లిన పల్లెవెలుగు బస్సులు సైతం.. జిల్లాలోని ఇతర డిపోల నుంచి నగరానికి వచ్చి వెళ్లే సమయంలో.. కాలుష్యకారకమైన పొగను మరింత వెదజల్లుతున్నాయి. ఇలా వచ్చే సర్వీసులు నిత్యం వేలల్లో ఉంటున్నాయి. వీటి నుంచి వెలువడే పొగ.. సిటీ బస్సులకు అదనం. ఏటేటా పెరిగిపోతున్న ప్రైవేటు వాహనాల కాలుష్యానికి.. ఆర్టీసీ బస్సులు తోడవ్వడంతో శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ఈ బస్సులను అత్యవసరంగా మార్చి.. విజయవాడ నగరంలో కొత్తగా కనీసం మరో 200 బస్సులనైనా అందుబాటులోనికి తేవాల్సి ఉన్నా.. ఆర్టీసీకి పట్టడం లేదు. ఏటా.. పాత బస్సులనే కొత్తగా రంగులతో ముస్తాబు చేసి.. తీసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడలో ఆర్టీసీ బస్సులే ప్రజారవాణాలో అత్యంత కీలకం. రాజధానిగా మారిన తర్వాత అనూహ్యంగా జనాభా పెరిగింది. గత ఐదేళ్లలోనే కొత్తగా కనీసం ఐదారు లక్షల మంది జనాభా పెరిగారు. కానీ.. జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ కొత్త బస్సులు పెరగలేదు. దీంతో పాత బస్సులనే తిప్పుతున్నారు. రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలన్నింటికీ బస్సులు నడుస్తున్నాయి. బందరు, ఏలూరు రోడ్లు, గుణదల, మాచవరం, సింగ్‌నగర్, సత్యనారాయణపురం, పంటకాలువ రోడ్డు, కృష్ణలంక, వన్‌టౌన్, చిట్టినగర్, విద్యాధరపురం, భవానీపురం, ఇబ్రహీంపట్నం, జాతీయ రహదారి వెంబడి గన్నవరం వరకూ.. కీలకమైన ప్రాంతాలన్నింటిలోనూ ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. దీంతో అన్ని ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ ఈ కాలం చెల్లినవి అధికంగా ఉంటున్నాయి. వీటి వల్ల నిత్యం గాలిలోనికి విడుదలయ్యే ప్రమాదకరమైన పొగ దెబ్బకు.. స్వచ్ఛమైన గాలి దొరకడమే కష్టమైపోతోంది.