పశ్చిమగోదావరి: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా, పారదర్శకత కోసం సర్కారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా ‘క్యూఆర్ కోడ్’ విధానం తెరపైకి తెచ్చింది. అయితే కొన్ని లోపాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు నెలలో మూడు విడతలుగా గుడ్లు సరఫరా చేస్తోంది. 1-10, 11-20, 21-30 తేదీల మధ్య గుడ్లు సరఫరా చేయాలని నిర్ణయించింది.అన్ని కేంద్రాలకు చేరిన తర్వాత క్యూఆర్ కోడ్‌ను గుడ్లుపై ఉంచి కార్యకర్తలు స్కాన్ చేయాలి. దీని వల్ల సకాలంలో గుడ్లు సరఫరా అయిందీ లేనిదీ ఐసీడీఎస్ అధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంతవరకు బాగానే కొన్ని కేంద్రాల్లో చరవాణిలో స్కాన్ చేస్తుంటే యాప్ మొరాయిస్తుంది. ఆ శాఖ అధికారులు స్వయంగా పరిశీలించినా ఫలితం లేక దస్త్రాల్లోనే వివరాలను నమోదు చేస్తున్నారు. వివరాలను స్కాన్ చేయకపోతే మళ్లీ ఏం సమస్య వస్తుందోనని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని 3889 అంగన్‌వాడీ కేంద్రాల్లో 167690 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెలా 7 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు గల బాలలకు ఎనిమిది, 3-6 ఏళ్ల వయసు బాలలకు 16, బాలింతలు, గర్భిణులకు 25 గుడ్లు సరఫరా చేస్తున్నారు. మొత్తం మీద నెలకు 18.15 లక్షల గుడ్లు సరఫరా అవుతున్నాయి. కోడిగుడ్లు సరఫరాలో అవకతవకల నివారణకు ఇప్పటికే పలు ప్రయత్నాలు జరిగాయి. గతంలో 15 రోజులకోసారి, ఆ తర్వాత వారానికోసారి ఇలా గుత్తేదారులు ఇష్టారాజ్యంగా సరఫరా చేసేవారు. తర్వాత రోజుకో రంగు చొప్పున కేటాయించారు. రోజుల వారీగా రంగు వేసిన ముద్ర ఉన్న గుడ్లు వాడాలని సూచించారు. తాజాగా క్యూఆర్ కోడ్ విధానం అమలు చేస్తున్నారు. ఐసీడీఎస్ కొయ్యలగూడెం ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో సీడీపీవో లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొందరు సిబ్బంది చిత్తశుద్ధితో విధులకు హాజరవుతున్నా చాలా చోట్ల సమయపాలన పాటించడం లేదు. వేసవి తీవ్రత నేపథ్యంలో కార్యకర్తలు, సహాయకులు చెరి పదిహేను రోజులు సెలవులను వినియోగించే వెసలుబాటును ప్రభుత్వం కల్పించింది. కేంద్రాలు మూతపడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోడిగుడ్ల సరఫరాకు సంబంధించి క్యూఆర్ కోడ్ స్కానింగ్, న్యూట్రిటాస్క్ యాప్, పిల్లల హాజరు యాప్ ఇలా పలు యాప్‌ల నిర్వహణ కోసం తొలి 15 రోజులు కార్యకర్తలను కేంద్రాల్లోనే ఉంచి సహాయకులకు సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత 15 రోజులు సహాయకులను కేంద్రాల్లో ఉంచి కార్యకర్తలకు సెలవులు ప్రకటించారు. పలుచోట్ల దీనికి భిన్నంగా జరుగుతోంది. వేసవి సెలవులను కొందరు ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు. కనీసం కేంద్రాల్లో ఎవరు సెలవులో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి