యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు దేశవ్యాప్తంగా జరగనుంది. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నివాసాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. టీడీపీ, వైసీపీ తరపున ఎమ్యెల్యే, ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్థులు ఆయా పార్టీ అధినేతల ఇళ్లకు, కార్యాలయాలకు అనుచరులతో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, జగన్ నివాసాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత కల్పిస్తున్నారు. చంద్రబాబు, జగన్ నివాసాలు, పార్టీ కార్యాలయాలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోనే ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ఏపీఎస్‌పీతో పాటు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకున్నారు. బుధవారం రాత్రి నుంచి వీరి నివాసాల వద్ద ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన రెండేసి కంపెనీల బలగాలు పహారా కాస్తాయి. స్థానిక పోలీసులు సైతం 50 మంది చొప్పున భద్రతా విదుల్లో ఉంటారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలు తాడేపల్లికి దగ్గరగా ఉండటంతో ఆ జిల్లాల్లో గెలుపొందిన అభ్యర్థులు వెంటనే ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఆయా పార్టీలకు చెందిన నేతలు తరలివస్తే వారందరిని నియంత్రించడం స్ధానిక పోలీసులకు కష్టమవుతుందని భావించిన ఏపీ పోలీసులు ఏపీఎస్‌పీ పోలీసుల సాయం తీసుకున్నారు. ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.