యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎగ్జిట్‌పోల్స్ కర్ణాటక ప్రభుత్వంలో చిచ్చుపెట్టాయి. కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చడంతో అధికార కాంగ్రెస్-జేడీఎస్ మధ్య మొదలైన వివాదం తారాస్థాయికి చేరుతున్నది. జేడీఎస్ అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మే 23న తమకు అనుకూలంగా ఫలితాలు రాకుంటే కూటమిలో కొనసాగడం కష్టమేనన్నారు. కాంగ్రెస్ నేత బ్రిజేశ్ కలప్ప సైతం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం కచ్చితంగా కూటమిపై పడుతుందన్నారు. మరోవైపు మంగళవారం ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశానికి కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి గైర్హాజరయ్యారు. ఇందుకు కారణాలను వెల్లడించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏహెచ్ విశ్వనాథ్ వత్తాసు పలికారు. ఇదే అదునుగా బీజేపీ సైతం ప్రభుత్వాన్ని పడగొట్టే దారులు వెతుకుతున్నట్టు తెలుస్తున్నది. పలువురు కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం నుంచి వైదొలుగడమే మేలని రాష్ట్ర నాయకత్వానికి సూచిస్తున్నారు. జేడీఎస్‌తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చినా.. ఏడాదిగా దినదిన గండంగా నడుస్తున్నదని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే సమయం సరిపోతున్నదంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో తీవ్రంగా నష్టపోయిందని చెప్తున్నారు. ఉదాహరణకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయానికి పాత మైసూర్ ప్రాంతం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేదని, ఇప్పుడు బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయిందని గుర్తుచేస్తున్నారు. అధికారానికి అడుగుదూరంలో నిలిచిపోయి విపక్షంలో కూర్చున్న బీజేపీకి కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు కర్ణాటకలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కుండోగోల్ ఎమ్మెల్యే, మంత్రి సీఎస్ శివళ్లి ఇటీవలే తుదిశ్వాస విడిచారు. చించోలి కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉమేశ్ జాదవ్ బీజేపీలో చేరారు. దీంతో ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 19న పోలింగ్ జరిగింది. ఈ రెండు సీట్లు తమకే దక్కుతాయని బీజేపీ ధీమాగా ఉన్నది. 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 113. బీజేపీకి ప్రస్తుతం 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్రులు మద్దతు పలుకుతున్నారు. ఉప ఎన్నికలు జరిగిన రెండు స్థానాలు తమ ఖాతాలో పడితే బలం 108కి చేరుతుందని, అధికారానికి మరింత చేరువ అవుతామని బీజేపీ భావిస్తున్నది.