YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

11 రోజుల్లో 9 లక్షల మంది దర్శనం

11 రోజుల్లో 9 లక్షల మంది దర్శనం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా వెలుగొందుతోన్న క‌లియుగ‌ ప్ర‌త్య‌క్ష దైవ‌ం శ్రీ వేంక‌టేశ్వ‌రస్వామి కొలువున్న తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో స్వామి దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు. గత పదకొండు రోజుల్లోనే రికార్డుస్థాయిలో 9.7 లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. మే11 నుంచి 21 వ వ‌ర‌కు పదకొండు రోజుల్లో 9,68,233 మంది భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకున్న‌ట్లు టీటీడీ ఇన్‌చార్జ్ జెఈవో ల‌క్ష్మీకాంతం తెలిపారు.  వేస‌వి సెల‌వులు, ఇంటర్, పదో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు వెల్లడికావడంతో రోజు రోజుకు తిరుమ‌ల‌లో భక్తుల ర‌ద్దీ పెరుగుతున్న‌ద‌ని అన్నారు. మే 12న ఆదివారం 1,01,086 మంది, మే 19న ఆదివారం 1,00,912 మంది భ‌క్తులు స్వామిని దర్శించినట్టు వెల్లడించారు. సాధార‌ణంగా బ్ర‌హ్మోత్స‌వాల తొమ్మిది రోజుల‌లో శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల కంటే వేస‌విలోని ఈ 9 రోజులూ ద‌ర్శించుకునే వారి సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. శ్రీ‌వారి భ‌క్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు, సిబ్బంది స‌మిష్టి కృషితో నిర్ణీత స‌మ‌యంలో సంతృప్తిక‌రంగా స్వామి ద‌ర్శ‌నం క‌ల్పించామాని తెలియ‌జేశారు. నారాయణగిరి ఉద్యానవనంలోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు, వైకుంఠం 1, 2 కంపార్టుమెంట్లలోని భక్తులకు దాదాపు 3 వేల మంది శ్రీ‌వారిసేవ‌కులు 24 గంట‌లూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు పంపిణీ చేస్తున్న‌ట్లు వివరించారు. అలాగే ఇంజినీరింగు, నిఘా, భద్రతా సిబ్బంది స‌మ‌న్వ‌యంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు ల‌క్ష‌లాదిగా విచ్చేసే భక్తులకు క‌ల్యాణ‌క‌ట్ట‌, ఎల‌క్ట్రిక‌ల్‌, రెడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్‌, వైద్యం, ఐటీ, ర‌వాణా విభాగం, మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఆరోగ్య విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు.

Related Posts