గురువారం వెలువడనున్న లోక్‌సభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ప్రాంతీయ పార్టీలను తమ వైపునకు తిప్పుకోవాలనే వ్యూహంతోనే ఎన్డీయే విజయం సాధించబోతున్నట్లు ఎగ్జిట్‌పోల్స్ ద్వారా చెప్పించారని టీపీసీసీ ఆరోపించింది. బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన స్థానాలకన్నా ఎన్ని స్థానాలు ఎక్కువ, ఎన్ని తక్కువ అనేది ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడించలేదని, అన్ని పోల్స్ ఫలితాల్లోనూ గతం కన్నా తక్కువగా ఎన్డీయే 275–285 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్పారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
అదే సమయంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలకన్నా మూడు రెట్లు ఎక్కువ వస్తాయని అవే ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయని గుర్తు చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలలో మోదీ హవా ఎక్కడా కనిపించలేదని అభిప్రాయపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రధాని మోదీ కేదార్‌నాథ్ యాత్రను దుర్వినియోగం చేశారని విమర్శించారు. సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడని, మోదీ మాత్రం దక్షిణం వైపు తిరిగి సూర్యనమస్కారం చేస్తున్నట్టు ఫోటోలకు పోజివ్వడం హిందువులను అవమానపర్చడమేనన్నారు. యూపీఏ గెలుస్తుందనే భయం, తామే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే దురాశ బీజేపీలో కనిపిస్తోందని ఆ ప్రకటనలో ఆరోపించారు.