యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సుప్రీంకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి సంతకం అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన బుధవారం సాయంత్రం కానీ, గురువారం కానీ వెలువడుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి
పొందుతున్నారు. వీరి నియామకాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు పదోన్నతి కల్పించాలన్న కొలీజియం సిఫారసులను గతంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. వీరి సీనియారిటీ, ప్రాంతీయతలను కారణాలుగా చూపుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే కొలీజియం తన పట్టు సడలించలేదు. వీరిద్దరి సమర్థత, నడవడిక, చిత్తశుద్ధి విషయంలో ఎటువంటి ప్రతికూలత కనిపించలేదని స్పష్టం చేసింది.జస్టిస్ బోస్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, జస్టిస్ బోపన్న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేస్తున్నారు. జస్టిస్ గవాయ్ బోంబే హైకోర్టు జడ్జిగానూ, జస్టిస్ కాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తిగానూ పని చేస్తున్నారు.సుప్రీంకోర్టులో మొత్తం 31మంది జడ్జిలను నియమించేందుకు అనుమతి ఉంది. ప్రధాన న్యాయమూర్తితో సహా 31మంది న్యాయమూర్తులు ఉండాలి. ఇప్పటి వరకు
27 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. తాజాగా నలుగురిని నియమిస్తే అనుమతి ఉన్న సంఖ్యలో న్యాయమూర్తులను నియమించినట్లవుతుంది.