యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి 1972 డిసెంబరు 21న జన్మించారు. నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత మేనేజ్ మెంట్ కోర్సులో చేరినప్పటికీ పూర్తి చేయలేదు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, విజయమ్మలకు తొలి సంతానం కాగా సోదరి షర్మిల. 1996లో భారతీరెడ్డితో వివాహం. వారికి హర్షా, వర్షా ఇద్దరు కూతుళ్లు. మితంగా తినడం ఇష్టం. టీ అంటే ఎక్కువ ఇష్టపడుతారు. తెల్లచొక్కాలు ధరించడానికి ప్రాధాన్యతనిస్తారు.
2009 కంటే ముందు బెంగళూరు కేంద్రంగా అనేక వ్యాపారాలు చేసిన వైఎస్ జగన్. తన తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో తొలిసారి రాజకీయాలపై ఆసక్తి చూపారు. కుమారుడు జగన్ ను కడప నుంచి ఎంపీగా బరిలోకి దించే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించిన వైఎస్సార్… తొలి పోటీ లోనే జగన్ ను విజేతగా నిలిపారు. వైఎస్సార్ రెండోసారి అధికారం చేపట్టాక 2009లో హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడంతో ఆయన మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన అభిమానుల పరామర్శ కోసం జగన్ ఓదార్పుయాత్ర చేపట్టారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం అడ్డుకోవడంతో చేసేది లేక పార్టీకి జగన్, ఆయన తల్లి విజయమ్మ రాజీనామా చేశారు. ఆ తరువాత ఈ రెండు స్థానాలకూ జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా జగన్ కనీవినీ ఎరుగని రీతిలో 5.45 లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో, విజయమ్మ పులివెందుల నుంచి 75 వేల ఓట్ల భారీ ఆధిక్యతతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని ఢీకొన్న జగన్.. అధికార పీఠం చేరుకోలేకపోయినా 67 సీట్లను వైసీపీకి సాధించిపెట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది.
2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీని స్ధాపించిన జగన్ ను అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యంగా చేసుకుంది. షెల్ కంపెనీల స్ధాపనతో పాటు అక్రమ మార్గాల్లో తన సొంత మీడియా సంస్ధ సాక్షిలో పెట్టుబడులు తెచ్చుకున్నారన్న ఆరోపణలపై ఆయన 16 నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్లపై ఇప్పటికీ జగన్ కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. జగన్ అక్రమాస్తుల కేసుతో ప్రమేయం ఉన్న పలువురు అధికారులపై అభియోగాలు నమోదైన వారిలో అత్యధిక శాతం హైకోర్టులో పోరాడి క్లీన్ చిట్ తెచ్చుకున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాట్ ఫేవరేట్గా బరిలో దిగింది. కానీ చంద్రబాబు.. నరేంద్రమోదీ, పవన్కల్యాణ్ సహకారంతో కేవలం 1.6 శాతం ఓట్లతో గట్టెక్కారు. ఈఎన్నికల్లో వైఎస్ జగన్ పులివెందుల నియోజకవర్గం నుంచి 75,243 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక 175 స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 65 గెలిచి ఏకైక ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లిన జగన్… ఏడాది క్రితం ప్రజాసంకల్పయాత్ర చేపట్టారు. మూడున్నర వేల కిలోమీటర్ల మేర సాగిన యాత్రలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించిన జగన్, ప్రస్తుతం తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే తన తండ్రి వైఎస్సార్ పాలనను మరిపిస్తానని హామీ ఇచ్చారు.