యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నరేంద్ర మోదీ మరోసారి తన ఛరిష్మాను ప్రదర్శించారు. రాజకీయాల్లో తనను మించిన వ్యక్తి ఎవరూ దరిదాపుల్లో లేరని నిరూపించారు. ఎవరు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా..విపక్షాలన్నీ ఏకమై దాడులు చేసినా ఒకే ఒక్కడై పార్టీని నడిపించారు. దేశం తన వైపు చూసుకునేలా చేశారు. అమిత్ షా అండ్ టీం ఇపుడు మరింత పటిష్టంగా తయారైందనే చెప్పాలి. అతిరథ మహారథులు, రాజకీయ ఉద్దండులు 17వ లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో చాలా మంది అడ్రస్లు గల్లంతయ్యాయి. తాజాగా ప్రకటించిన సర్వే సంస్థల ఫలితాల కంటే భిన్నంగా మరింత ఆధిక్యంలో మోదీ నాయకత్వంలోని ఎన్ డిఏ మెజార్టీ కంటే ఎక్కువగా దూసుకెళ్లింది. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడంతో 48 ఏళ్ల రికార్డ్ ఆయన తిరగరాస్తున్నారు. ఎందుకంటే 48 సంవత్సరాల తర్వాత ఒకే పార్టీ, ఒకే వ్యక్తి వరుస ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవ్వడం జరగనుంది. 1967లో జరిగిన ఎన్నికల్లో కూడా ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీతో గెలిచి అధికారం దక్కించుకుంది. ఆ తర్వాత అంటే, 1971 ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీతో ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సర్వే సంస్థల అంచనాలు దాటి మోదీ తన ప్రతాపాన్ని చూపించారు. ఇక బెంగాల్లో కూడా కమలం వికసించేలా చేశారు. హస్తిన వీధుల్లో కమలనాథుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. మోదీ నేతృత్వంలోని ఎన్ డిఏ రెండోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా రాకెట్ కంటే వేగంగా ముందుకెళింది. ఓ వైపు నోట్ల రద్దు, నిరుద్యోగం, ప్రజలను ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకున్నా ఏ దశలోనూ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు మోదీని ఢీకొనలేక పోయాయి. కాంగ్రెస్ పార్టీ కూటమి 100 సీట్ల లోపే సర్దుకుంది. అనూహ్యంగా రీజినల్ పార్టీలు తమ సత్తాను చాటాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాలలో బీజేపీ తన జోరు పెంచింది.