YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కొత్త రికార్డ్...

జగన్ కొత్త రికార్డ్...

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:     

రాజకీయాల్లో వారసత్వం అనేది కొత్తేమీకాదు. తమ కుటుంబసభ్యుల బాటలో అనేక మంది నాయకులు రాజకీయాల్లోకి వచ్చారు. వారిలో కొంతమంది రాణించగా... మరికొంతమంది విఫలయ్యారు. అలా తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక మంది నాయకులు వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. అయితే ఇలాంటి వారిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో తండ్రి తరువాత రాష్ట్రానికి సీఎం అయిన మొదటి వ్యక్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రికార్డ్ సృష్టించబోతున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... వైఎస్ఆర్ మరణం తరువాత రాష్ట్రానికి సీఎం అయ్యేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను వీడి వైసీపీని స్థాపించిన జగన్... రాష్ట్ర విభజన కారణంగా ఏపీ రాజకీయాలకు పరిమితమయ్యారు. 2014లో అధికారంలోకి రాలేకపోయినా... 2019లో తాను అనుకున్నది సాధించారు.వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి ముందు అనేక మంది నేతలు ఏపీకి ముఖ్యమంత్రులుగా పని చేశారు. అయితే వారి వారసులెవరూ
రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కాలేకపోయారు. మాజీ ముఖ్యమంత్రులు పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, కాసు బ్రహ్మనందరెడ్డి రాజకీయ వారసులు మంత్రులుగా పని చేసినా... సీఎం స్థాయికి మాత్రం ఎదగలేకపోయారు. దీంతో ఈ బ్యాడ్ సెంటిమెంట్ జగన్‌ను కూడా వెంటాడుతుందనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. అయితే తండ్రి తరహాలోనే సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...ఆయనలాగే సీఎం పదవిని చేపట్టబోతున్నారు.

Related Posts