యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లో సినిమాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.... అన్నయ్య ప్రజా రాజ్యంతో సాధించలేనిది తను జనసేనతో సాధించాలనే పట్టుదలతో 2014 ఎన్నికల ముందు జనసేనను స్థాపించాడు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా పోటీకి దిగకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు గడిచేసరికి బీజేపీ, టీడీపీ బంధానికి గుడ్ బై చెప్పి 2019 ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతో పాటు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాకతో పాటు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసినా.. ఎక్కడ ప్రభావం చూపించలేకపోవడం పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్.. మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఒక్క రాజోలు లో మాత్రమే జనసేన లీడ్‌లో ఉంది. ఇక లోక్‌సభ నియోజకవర్గాల గురించి అసలు మాట్లాడకపోవడమే మంచిది. ఎక్కడ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది జనసేన పార్టీ.ఇక2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ తరుపున చిరంజీవి కోస్తా జిల్లాలోని పాలకొల్లుతో పాటు రాయలసీమలోని తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి.. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓటమి పాలయ్యారు. పాలకొల్లులో ఓడిపోయినా.. తిరుపతి నుంచి మాత్రం చిరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 18 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్‘యువరాజ్యం’ అధ్యక్షుడిగా పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. అన్నయ్య చిరంజీవి వచ్చిన 18 సీట్లు వచ్చాయి. ఇక జనసేన ఏపీ అసెంబ్లీలో ఒక్క సీటుకే పరిమితం కానున్నట్టు ట్రెండ్స్ చూస్తే చెప్పొచ్చు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో ఏదో చేద్దామనుకున్న పవన్ కళ్యాణ్‌కు ఈ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేసాయి. ఇక బీఎస్పీతో కలిసి ఒక వర్గం ఓట్లను దక్కించుకోవాలనకున్న పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ఎక్కడ సఫలం కాలేదు. మొత్తానికి ఈ ఎన్నికలు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసాయి.