యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పశ్చిమ బెంగాల్‌లో కమలం వికసించింది. దీదీ కోటలో మోదీ మంచి ఫలితాలను రాబడుతున్నారు. హోరాహోరీ పోరు తలపించిన బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తిరుగులేని ఆధిపత్యానికి కాషాయం పార్టీ ఈసారి గట్టి సవాల్ విసిరింది. రాష్ట్రంలో మొత్తం 42 స్థానాల ఉండగా.. అధికార టీఎంసీ కేవలం 23 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. గతంలో పెద్దగా ప్రభావం చూపని బీజేపీ ఈసారి ఏకంగా 17 ఎంపీ స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది.ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచోకోటగా ఉన్న బెంగాల్‌లో 2012 ఎన్నికల్లో వామపక్షాలను చిత్తుచేసి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వామపక్షాలను కోలుకోకుండా చేసి.. వరుస విజయాలతో బెంగాల్‌పై దీదీ ఆధిపత్యం చలాయిస్తున్నారు. 2012 ఎన్నికల నుంచి దీదీ అధికారంలోకి రావడంతో బీజేపీ కొంత కొంతగా ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఛిన్నాభిన్నమైన వామపక్షాల ఓటుబ్యాంకు కొంత బీజేపీకి కలిసిరావడం.. మొదట్లో దీదీ కూడా బీజేపీ పట్ల అంత కఠినమైన వైఖరి ప్రదర్శించకపోవడంతో ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎదిగేందుకు కమలం పార్టీ అధినాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్‌లో కేవలం రెండు స్థానాల్లో గెలుపొందింది. ఈ రెండు స్థానాలను ఆలంబనగా చేసుకుంటూ.. దీదీకి ప్రతిపక్షంగా ఎదుగుతూ.. క్రమంగా తృణమూల్‌కు సవాల్ చేసే స్థాయికి బీజేపీ ఎదిగింది. ఈసారి ఎన్నికలు దీదీ-మోదీ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా సాగాయి. దీదీపై మోదీ, అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడగా.. మమతా బెనర్జీ కాషాయ నేతలకు దీటుగా బదులిచ్చారు. ఇందుకు తోడు క్షేత్రస్థాయిలో బీజేపీ-టీఎంసీ కార్యకర్తల ఘర్షణతో ఈసారి ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది. ఈ క్రమంలోనే బెంగాల్‌లో వికసించాలన్న కమలం వ్యూహ ఫలించినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు లెఫ్ట్‌కు జైకొట్టిన బెంగాల్ ఇప్పుడు క్రమంగా రైట్ వైపు (హిందుత్వ వైపు) మొగ్గుతున్నట్టు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.