యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కేంద్రంలో చక్రం తిప్పుతానని దేశరాజధానిలో తెగహల్‌చల్ చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. సొంత రాష్ట్రంలో ఘోర ఓటమిని చవిచూశారు. అసెంబ్లీ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ
ప్రభంజనానికి కొట్టుకుపోయిన టీడీపీ.. లోక్‌సభలో అయితే ఖాతా తెరిచే పరిస్థితి కూడా లేదు. 25 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికే ఒకటి గెలిచిన వైఎస్సార్‌సీపీ మరో 24 స్థానాల్లో ఆధిక్యంలో
దూసుకెళ్తోంది. దీంతో కేంద్రంలో చక్రం తిప్పుతానన్న చంద్రబాబుకు పార్లమెంట్‌లో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఎన్నికల ముందు బీజేపీయేతర పార్టీలను ఏకతాటికి తెస్తానని పలు ప్రాంతీయ పార్టీల ఇళ్ల చుట్టు ప్రదిక్షణలు చేసిన చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే గట్టి షాక్ తగిలింది. దీంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు నాయుడి సమావేశంతో ప్రారంభమై.. సోనియాగాంధీ, దేవగౌడ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ఇళ్ల మీదుగా.. చివరకు ఈ రోజు సాయంత్రం గవర్నర్‌తో సమావేశంలో రాజీనామా లేఖ సమర్పించడంతో ముగిసిందని సెటైరిక్‌గా ట్వీట్ చేస్తున్నారు. మహా కూటమికి మహా ఓటమి అనే మీమ్స్‌ను ట్రెండ్ చేస్తున్నారు.