YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మండ్య నుంచి సుమలత ఘన విజయం

మండ్య నుంచి సుమలత ఘన విజయం

కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన నుంచి ఇద్దరు సినీ ప్రముఖుల్లో ఒకరిని మాత్రమే విజయం వరించింది.  అయితే వీరిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడం విశేషం. వారే అలనాటి నటి సుమలత, ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌. అయితే వీరిలో మండ్య నుంచి పోటీ చేసిన సుమలత సెంటిమెంట్‌తో గెలవగా.. ప్రకాశ్‌రాజ్‌ కనీసం ప్రత్యర్థులకు పోటీ కూడా ఇవ్వలేకపోయారు. దివంగత నటుడు, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ అంబరీశ్‌ సతీమణి, నటి సుమలత రాజకీయ ప్రవేశం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మండ్య నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన అంబరీశ్‌ గతేడాది కన్నుమూశారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన భార్య సుమలత సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించగా.. పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటును జేడీఎస్‌కు కేటాయించడంతో సుమలతకు టికెట్‌ ఇవ్వలేదు. దీంతో అసహనానికి గురైన సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.అటు జేడీఎస్‌ ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు నిఖిల్‌ కుమారస్వామిని బరిలోకి దింపింది. సీఎం కుమారస్వామి కుమారుడైన నిఖిల్‌ తాజా ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దీంతో తమకు ఎంతో పట్టున్న మండ్య నుంచి నిఖిల్‌ను పోటీలో నిలబెట్టింది జేడీఎస్‌. మరో విషయమేంటంటే నిఖిల్‌ కూడా సినీనటుడే. మరోవైపు సుమలతకు మద్దతిచ్చేందుకు భాజపా ఇక్కడ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. దీంతో మండ్య పోరు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రతిష్ఠాత్మక పోరులో నిఖిల్‌పై సుమలత విజయం సాధించారు. మండ్య ఎన్నికల్లో ఒక్కళిగల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.సుమలత ఒక్కళిగ సామాజికవర్గానికి చెందినవారు కాకపోయినా అంబరీశ్‌ అదే కులానికి చెందినవారు. ఇది ఆమెకు కలిసొచ్చింది. దీంతో పాటు కన్నడ సినీప్రముఖుల మద్దతు కూడా సుమలతకే ఉండటంతో హోరాహోరీ పోరులో ఆమె గెలుపొంది తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. అంతేగాక.. 52ఏళ్ల తర్వాత మండ్య నుంచి లోక్‌సభకు వెళ్తున్న తొలి మహిళా స్వతంత్ర ఎంపీగా గుర్తింపు సాధించారు.

Related Posts