యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. అధికారం చేపడతామని, ప్రత్యామ్నాయం తామే అని వచ్చిన ఆ పార్టీ బొక్కబోర్లా పడింది. స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన స్వం జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో ఓటమిపాలయ్యరు. ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ 3938 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక, పవన్ కళ్యాణ్ పోటీ చేసిన మరో నియోజకవర్గం గాజువాకలోనూ ఆయన 7,700 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పై వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి ఆధిక్యతలో ఉన్నారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకతోపాటు భీమవరం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఊపు తేవడం కోసం ఆయన.. భీమవరం నుంచి పోటీ చేశారు. భీమవరంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా పవన్ ఇక్కడి నుంచి పోటీకి దిగడానికి కారణమైందని వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఏపీ రాజకీయాల్లో భీమవరం హాట్ టాపిక్ అయ్యింది. భీమవరంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ పోటీ చేశారు. పులవర్తి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో.. ఇక్కడ వైఎస్ఆర్సీపీ, జనసేనాన మధ్యే గట్టి పోటీ జరిగిందని తెలుస్తోంది. భీమవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్.. లోకల్ హీరోకు, యాక్టర్ మధ్య పోరంటూ.. గ్రంథిని హీరో చేసేశారు. భీమవరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరితే శీనన్నకు మంత్రి పదవి ఇస్తానన్నారు. గ్రంథి వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆయన పట్ల ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. ఓడినప్పటికీ గత ఐదేళ్లుగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. యువతరం, కాపు సామాజికవర్గం పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో.. భీమవరంలో పవన్ గెలిచే అవకాశాలున్నాయి. తాను గెలుపొందితే భీమవరం సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం కూడా జనంపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు.