యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశమంతా మోదీ ప్రభంజనం కొనసాగింది. ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ తన ప్రాభవాన్ని కనబరిచింది. దక్షిణాదిలో కర్నాటక నుంచి కూడా బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రస్పుటంగా చూపించింది. అయితే ఈ సారి కేరళ నుంచి బీజేపీ బోణీ కొడుతుందన్న ఊహాగానాలు చాలా వినిపించాయి. ఒకటి లేదా రెండు సీట్లు బీజేపీ ఖాతాలో పడుతాయన్న అంచనాలు బలంగా సాగాయి. కానీ యూడీఎఫ్ కూటమే అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నది. 20 సీట్లు ఉన్న కేరళలో.. యూడీఎఫ్ కూటమి దాదాపు అన్నింట్లోనూ దూసుకెళ్లుతున్నది. వయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. సుమారు 8 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం వైపు పయనిస్తున్నారు. కేరళలో ఒక్కటైనా కాషాయ సీటు వస్తుందని వేసిన అంచనాలు తారుమారయ్యాయి. ఒక్క తిరువనంతపురం స్థానం నుంచి మాత్రమే బీజేపీ కొంత పోటీనిచ్చింది. మొదట్లో ఆ స్థానం నుంచి బీజేపీ లీడ్‌లో ఉన్నా.. ఆ తర్వాత శశి థరూర్ దూకుడుకు చేతులెత్తేసింది. శబరిమల అంశం బీజేపీకి కలిసి వస్తుందని అనుకున్నారు. కేరళలో ఖాతా తెరవాలంటే ఆ సమస్యే కీలకమని భావించారు. కానీ శబరిమల సమస్య.. బీజేపీకి కలిసి రాలేదు. శబరిమల వివాదానికి కేంద్రబిందువైన పాతనమిట్ట
నియోజకవర్గంలోనైనా బీజేపీ గెలుస్తుందని ఆశించారు. కానీ ఆ ఎత్తు కూడా పనిచేయలేదు.