యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో నీటి సామర్థ్యం తగ్గిపోతుంది. నిత్యం నిండుగా కనిపించే ఎల్లంపల్లిలో నీటి నిల్వలు రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి.ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న ఫలితంగా ప్రాజెక్ట్‌లో నీటి సామర్థ్యం బాగా తగ్గిన ఫలితంగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి కూడా నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను పోల్చుకుంటే ఎండ తీవ్రతను ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించకపోగా జూన్‌లో కూడా వర్షాలు పడే పరిస్థితులు కానరాని నేపథ్యంలో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు బాగా తగ్గుతూ పోతున్న క్రమంలో భవిష్యత్ రోజుల్లో మరింతగా నీటి సామర్థ్యం తగ్గితే తాగునీటి కష్టాలు ఏవిధంగా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ ఈ ప్రాజెక్ట్‌లో సుమారుగా 18 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 20.175 శతకోటి ఘనటపు అడుగులు (టీఎంసీ)లు కాగా ప్రస్తుతం రోజున 6.111 శత కోటి ఘనటపు అడుగుల నీటి సామర్థ్యం ఉన్నట్లు ప్రాజెక్ట్ ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ ఎఫ్‌ఆర్‌ఎల్ 148కు 141.03 ఎఫ్ ఆర్ ఎల్‌లో ఉంది. ఇన్‌ఫ్లో 341 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 653 క్యూసెక్కులు మాత్రమే ఉంటుంది. పెరుగుతున్న ఎండ తీవ్రతతో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో రోజు రోజుకు నీటి సామర్థ్యం తగ్గుతున్న కారణంగా ఎన్టీపీసీ విద్యుత్ సంస్థకు ఎల్లంపల్లి నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. ఎన్టీపీసీ సంస్థకు ఎల్లంపల్లి నుంచి ఏడాది 6.5 టీఎంసీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక రోజుకు ఎన్టీపీసీ కోసం ఏర్పాటు చేసిన పంప్ హౌస్ నుంచి రెండు పంపుల ద్వారా ఒక రోజుకు 210 క్యూసెక్కుల నీటిని వరకు సుమారుగా సరఫరా చేస్తుండగా నీటి సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో ఆ సరఫరాను నిలిపివేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయి స్కీంకు రోజుకు 280 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు తెలిపారు. రామగుండం సింగరేణికి 200 క్యూసెక్కులు, పెద్దపల్లి, రామగుండం మిషన్ భగీరథ స్కీంకు 18 క్యూసెక్కుల నీటిని సరఫరా జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.